శ్రీవారి బ్రహ్మోత్సవాలు దగ్గరికొచ్చిన వేళ.. టీటీడీ బాధ్యతల నుంచి ఈఓ రిలీవ్?
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ పాలక మండలి సభ్యులు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు. ఇటీవలే శ్యామలరావు బదిలీ అయిన విషయం తెలిసిందే. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. గతంలో సుదీర్ఘకాలం పాలు టీటీడీ ఈఓగా పని చేసిన అనుభవం సింఘాల్ కు ఉంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్యామలరావు మాట్లాడారు. టీటీడీలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని వ్యాఖ్యానించారు. టీటీడీ అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. తనకు పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు.

భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్వయంగా చేపట్టి, లోపాలను సవరించుకుంటూ, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం మరువలేనిదని అన్నారు. వచ్చే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థలను తీసుకువచ్చామని చెప్పారు.
ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. ఐఏఎస్ లకు టీటీడీ ఈవోగా పనిచేయాలని ఉంటుందని, తనకు కూడా ఇక్కడ పనిచేయాలనే కోరిక ఉండేదని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అవకాశం ఇచ్చారని, ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొంటోన్నానని చెప్పారు.
వెంకయ్య చౌదరి మాట్లాడుతూ- ఏడాది కాలంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. చాలా జఠిల సమస్యలను కూడా సమష్టిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు తయారీ, పంపిణీ, అన్నప్రసాదాల వితరణ, వసతిపై చాలా సంస్కరణలు తీసుకువచ్చారని, ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ విధానం ద్వారా అన్నప్రసాదాల పంపిణీలో భక్తుల నుండి 96 శాతం సంతృప్తి వ్యక్తం చేయడంలో ఆయన కృషి చాలా ఉందని అన్నారు.
ఐవీఆర్ఎస్ విధానం, వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం, శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, సదరు అభిప్రాయాలను అంతటిని క్రోడీకరించి లోపాలను సవరించుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో శ్యామల రావు కృషి అభినందనీయమని అన్నారు.
ఐటీ విభాగంలో సమూల మార్పులను శ్యామల రావు తీసుకువచ్చారని టీటీడీ జేఈవో వీ వీరబ్రహ్మం అన్నారు. టీటీడీలో భద్రతాపరంగా ప్రత్యేక దృష్టి పెట్టి భక్తులకు రక్షణ కల్పించడానికి పటిష్ట ఏర్పాట్లు చేశారని చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి మురళీకృష్ణ చెప్పారు. టీటీడీలో దళారి వ్యవస్థను కట్టడి చేసేందుకు విజిలెన్స్ విభాగాన్ని నిత్యం పర్యవేక్షించారని చెప్పారు.












Click it and Unblock the Notifications