వైసీపీ రెండో జాబితా అంటూ ఫేక్ నోట్ హల్‌చల్.. క్లారిటీ
YS Jagan: ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా ఇన్‌ఛార్జీలను నియమించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది నిజం కాదని, దీన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది.
రెండో జాబితాపై ఇంకా కసరత్తు కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వివరించింది. సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్న ప్రెస్ నోట్‌లో పొందుపరిచిన పేర్లు ఏవీ నిర్ధారించలేదని స్పష్టం చేసింది. పార్టీ క్యాడర్‌లో గందరగోళం సృష్టించడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తోన్న దుష్ప్రచారమని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది.

ఇదివరకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలను మార్చిన మాట వాస్తవమేనని, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు.. తమ పార్టీ క్యాడర్, ఆయా నియోజకవర్గాల ఓటర్లను అయోమయానికి గురి చేసేలా ఇష్టానుసారంగా పేర్లను మార్చి ప్రచారం చేస్తోన్నారని విమర్శించింది.
తాము ఓడిపోతామనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు తమ పార్టీపై బురదజల్లుతున్నారని ఆరోపించింది. పార్టీ మీద విషం చల్లి, తమపై తప్పుడు కథనాలు రాసి, ఫేక్ వార్తలు క్రియేట్ చేయడం సరికాదని పేర్కొంది. టీడీపీ-జనసేన పొత్తులు, పార్టీ వ్యవహారాల గురించి చూసుకోవాలని హితవు పలికింది.












Click it and Unblock the Notifications