
వివేకా హత్య కేసులో Dr.సునీతారెడ్డి నెక్స్ట్ స్టెప్ అదే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం చర్చకు వస్తున్న అంశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గట్టిగా పోరాటం చేస్తుండటంతో నిందితులకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆమె కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేసి గెలుపు దక్కించుకున్నారు. తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగడంలేదని, నిందితులు సహకరించకపోవడంతోపాటు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు. కేసు విచారణ పొరుగు రాష్ట్రాల్లో విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

కృషి చేస్తున్న సునీత
తన తండ్రి మరణం వెనక ఉన్న నిందితులను బాహ్యప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆమె కృషిచేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులకు కూడా బెదిరింపులు ఎదురయ్యాయి. సెంట్రల్ జైలు నుంచి వస్తుండగా వీరి వాహనాన్ని అడ్డగించిన కొందరు హెచ్చరికలు జారీచేయడంతో వాహన డ్రైవర్ తో అధికారులు కేసు పెట్టించారు. ఎస్పీ స్థాయి అధికారి ప్రస్తుతం కేసును పర్యవేక్షిస్తున్నారు.

మారణాయుధాలు లభ్యమవలేదు?
ఎవరెవరిపై అనుమానం ఉందో తెలుపుతూ వీరు ఛార్జిషీటు దాఖలు చేశారు. హత్యకు వాడిన మారణాయుధాలు దొరుకుతాయని భావించినప్పటికీ వాటి ఆచూకీ లభించలేదు. మరోవైపు అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరాడు. ఇటీవలే ఆరునెలల విరామం తర్వాత సీబీఐ అధికారులు మరోసారి తమ దర్యాప్తును ప్రారంభించారు.

మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు
కేసు అనేక మలుపులు తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సునీతను రాజకీయాల్లోకి తెచ్చేలా ఉన్నారే అంటూ టీడీపీపై గతంలో సజ్జల వ్యాఖ్యలు చేశారు. తీవ్రంగా పోరాటం చేస్తున్నప్పటికీ కుటుంబ పరంగా సహకారం అందక సునీత వెనకబడిపోతున్నారనే అభిప్రాయం వినవస్తోంది. రాజకీయంగా ముందుకు వస్తే న్యాయం జరుగుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వీటిని ఖండించనప్పటికీ సునీత మాత్రం ఎక్కడా బయట పడకుండా వస్తున్నారు. జనసేనాని పవన్ కూడా కేసులో సునీతకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన సునీతకు సహకరించడానికి సిద్ధంగా ఉండటంతో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ.. లేదంటే ఏ పార్టీలో చేరకుండా సొంతంగానే పోరాటం చేస్తారా? అనే మీమాంశ నెలకొంది.