వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై కిరణ్ రెడ్డి స్పీచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తన ప్రసంగాన్ని శాసనసభలో ప్రారంభించారు. ఆయన ప్రసంగానికి తెలంగాణ శాసనసభ్యులు అడ్డు తగిలే ప్రయత్నాలు చేశారు. బిల్లును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నా తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ప్రసంగం ఇలాసాగింది.

 Live: Kiran Reddy on Telangana draft bill

- రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే తమ పార్టీ తీసుకుందని కిరణ్ రెడ్డి అన్నారు. బిజెపి నుంచి తాను నీతివాక్యాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన జీవితంలో తాను ఏనాడూ మాట మార్చలేదని ఆయన అన్నారు.

- రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే రాష్ట్రానికి, జాతికి మంచిదిని ఆయన అన్నారు.

-దేశంలో పునర్వ్యస్థీకరణ జరిగినప్పుడు మన వద్దా జరిగంది.

- రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది.

- 1952లో ఆంధ్ర రాష్ట్రాన్ని జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు.

- భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1953లో నెహ్రూనే ప్రారంభించారు.

- నిజాం పాలన గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు.

- బిల్లును వ్యతిరేకిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభా నాయకుడిగా చెప్పారా, వ్యక్తిగతంగా చెప్పారా అనేది స్ఫష్టం చేయాలని తెలంగాణకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి అడిగారు సభా నాయకుడిగా చెప్తే తాము అందులో భాగం కాబోమని ఆయన అన్నారు.

- తాను కాంగ్రెసు నుంచి పలుమార్లు గెలిచానని, అయినా తాను చెప్పినా విభజన నిర్ణయం తీసుకున్నారో, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానో చెప్పే బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఇటువంటి సమయం వస్తుందని తాను అనుకోలేదని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిని సోనియా వల్ల, కాంగ్రెసు వల్లనే అయ్యానని, అయినా తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాననో తన బాధను అర్థం చేసుకోవాల్సి ఉందని, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో చర్చ ముగింపులో చెబుతానని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని ఎంచుకోవాలా, కాంగ్రెసు పార్టీని ఎంచుకోవాలా అనే క్లిష్టమైన సమస్య తనకు ఎదురైందని ఆయన అన్నారు.

- తెరాస సభ్యులు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతూ వెల్‌లోకి దూసుకొచ్చారు.

- ముఖ్యమంత్రి, సభా నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఇలా అడ్డుకోవడం సంప్రదాయం కాదని, కూర్చోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెరాస సభ్యులకు సూచించారు.

- ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ఇప్పుడే ప్రారంభించారని, మాట్లాడనివ్వాలని స్పీకర్ తెరాస సభ్యులకు సూచించారు. వెనక్కి వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు.

- మీ శాసనసబ్యులను వెనక్కి పిలవాలని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌కు స్పీకర్ సూచించారు. అయినా తెరాస సభ్యులు వినలేదు.

- సభా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, సభలో శాసనసభ్యులకు తన అభిప్రాయాన్ని చెప్పి, సభ అభిప్రాయాన్ని క్రోడీకరించి స్పీకర్ నివేదిక పంపిస్తారని సీమాంద్రకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒక్క పార్టీలో తప్ప మిగతా అన్ని పార్టీల్లో ఇరు ప్రాంతాల అభిప్రాయాలున్నాయని, వాటిని చెప్పే అవకాశం ఉందని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగలడం సరి కాదని ఆయన అన్నారు. చివరగా ముఖ్యమంత్రి ఏం చెబుతారో వందామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో విభేదిస్తే మీరు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. శాసనసభలో చర్చకు పొడగింపు వస్తుందేమోనని చూశామని, ఇంత వరకు రాలేదని, పొడగింపు అవకాశం లేకపోతే కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకుందామని ఆయన అన్నారు. తమ అభిప్రాయాలు చెప్పాం, మిగతావారు చెప్పాల్సిన అవసరం లేదనే పద్ధతిలో వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. జానారెడ్డి అడిగినా, తెరాస సభ్యులు అడిగినా ఆ స్థానం ఏమిటో చూడాలని, సభా నాయకుడికీ ముఖ్యమంత్రికీ మాత్రమే ఆ స్థానంలో కూర్చునే అవకాశం ఉందని, మరొకరు కూర్చునే అవకాశం లేదని ఆయన అన్నారు. సభా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పేందుకు సహకరించాలని ఆయన సూచించారు. సిఎం ఏ హోదాలో మాట్లాడారో పదే పదే అడగాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

- అయినా తెరాస సభ్యులు స్పీకర్ మాట వినలేదు. సభా సంప్రదాయాలు పాటించాలని స్పీకర్ వారికి సూచించారు. దీంతో విభజన బిల్లుపై చర్చకు అంతరాయం ఏర్పడింది.

-వుయ్ వాంట్ క్లారిఫికేషన్ అంటూ తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. కిరణ్ కుమార్ రెడ్డి సభా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా లేదా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

- విభజనకు వ్యతిరేకమని కిరణ్ కుమార్ రెడ్డి సభా నాయకుడిగా చెబుతున్నారా, సభా నాయకుడిగా చెప్తే అందులో తాను భాగం కాదలుచుకోలేదని తాను చెప్పానని కె. జానా రెడ్డి అన్నారు. సిఎం హోదాలో మాట్లాతున్నారో చెప్పాలని ఆయన అడిగారు.

తాను ఇప్పుడే మాట్లాడుతున్నానని, తాను చరిత్ర గురించి మాట్లాడుతున్నానని, చరిత్రలో చాలా విషయాలు చాలా ఉన్నాయని, వాస్తవాలను ప్రజల ముందు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత తన ప్రంసగాన్ని కొనసాగించారు.

- ఆంధ్ర రాష్ట్రం రావడానికి వాంఛో కమిషన్ వేశారని, తెలుగు భాష మాట్లాడేవారంతా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, కమిషన్ ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేయాలని 1952లో తీసుకున్న నిర్ణయమని ముఖ్యమంత్రి అన్నారు. 1953 నుంచి 1955 వరకు పార్లమెంటులో జరిగిన చర్చల్లో స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిని కర్నూలు పెట్టాలని చర్చ సాగిందని ఆయన అన్నారు. ఆ చర్చలో పాల్గొన్న అప్పటి ఎంపీలు కొంత మంది ఏం చెప్పారో ఆయన వివరించారు.

- విశాలాంధ్ర కావాలని, హైదరాబాద్ ను రాజధానిగా చేయాలని నిజామాబాద్ అప్పటి పార్లమెంటు సభ్యుడు చెప్పిన విషయాన్ని ఆయన ఉటంకించారు. హైదరాబాద్ వెలుపల తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేస్తే హైదరాబాద్ కనుమరగవుతుందని కరీంనగర్ ఎంపి అన్నట్లు ఆయన తెలిపారు.

- ఆంధ్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విశాలాంధ్ర కోరుకుంటున్నామని, అయితే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరగకూడదని అన్నట్లు పార్లమెంటులో అప్పటి నిజామాబాద్ ఎంపీ చెప్పినట్లు కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

- సరోజనీ నాయుడు నిజాం పాలనలో 1925లో ఎఐసిసి అధ్యక్షురాలిగా ఉన్నారని, నిజాం పాలన ఉన్నా కూడా సరోజినీ నాయుడు ఇక్కడి నుంచే ఎఐసిసి అధ్యక్షురాలిగా ఉన్నారని ఆయన గుర్తు చేస్తూ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే తెలంగాణను, ఆంధ్రతో కలపడానికి తెలంగాణ నుంచి చాలా మంది కోరారని చెప్పడానికేనని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి చాలా మంది కోరడం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.

- భారతదేశం పటిష్టంగా ఉఁడే విధంగా ఏర్పడాలని ఎస్సార్సీ సూచించిందని, దాని ప్రకారమే రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. విశాలాంధ్ర కావాలని తాను కోరుకుంటున్నానని, అలా కోరుకునేవారు తనతో రావాలని బూర్గుల రామకృష్ణా రావు సభలోనే అన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

- ఏకాభిప్రాయం లేకుండా రాష్టాలను ఏర్పాటు చేయకూడదని మొదటి ఎస్సార్సీ చెప్పిందని ఆయన అన్నారు.

- ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, తీసుకున్నారో చెప్పడానికే తాను మొదటి ఎస్సార్సీని ఉటంకిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- హైదరాబాద్ రాష్ట్రాన్ని తొందరగా లేకుండా చేయాలని అనుకోవడానికి అందులోని ప్రాంతాలు కొన్ని ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తున్నాయని, ఆంధ్ర రాష్ట్రం కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటే విలీనం చేయడం కష్టమవుతుందని త్వరగా నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.

- తెలుగువారంతా కలిసి ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని, భాషాసంస్కృతులు ఒక్కటే కాబట్టి కలిసి ఉంటే బాగుంటుందని అనుకున్నారని ఆయన చెప్పారు. కృష్ణాగోదావరి జీవ నదులు ఒక రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతందని భావించారని, రెండు రాష్ట్రాల విలీనానికి ఇదో కారణమని ఆయన చెప్పారు.

-రెండు ప్రాంతాలను బలవంతంగా కలపలేదని, అందరూ కోరడం వల్లనే విలీనం జరిగిందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

- 1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఇందిరా గాంధీ చేసిన ప్రసంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉందని ఆయన అన్నారు.

- 14ఎఫ్‌ను తీసేసినట్లే అప్పుడు ముల్కీ రూల్స్‌ను తీసేశారని ఆయన అన్నారు. 14 ఏళ్ల తర్వాత అటువంటి రూల్స్ ఉనికిలో ఉండవని ఆయన అన్నారు.

- ప్రశాంతంగా ఉన్నప్పుడే చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని ఇందిరా గాంధీ అప్పట్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇందిరా గాంధీ పార్లమెంటులో చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని ఆయన ఉటంకించారు. 1972 డిసెంబర్ 21వ తేదీన ఇందిరా గాంధీ చేసిన ప్రసంగాన్ని ఆయన ఉటంకించారు. వెనక్కి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటే నష్టం జరగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

- మన ముందు ఉన్న ప్రస్తుత ఉన్న అంశాల గురించి ఇందిరా గాంధీ ముందు చూపుతో ఆలోచించారని ఆయన అన్నారు. నిజాం పాలన కొంత మందికి బాగున్నా అందరికీ విద్యావకాశాలు లేవని ఇందిరా గాంధీ చెప్పారని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నట్లు ఇందిరా గాంధీ చెప్పారని ఆయన తెలిపారు.

- విభజన జరిగినంత మాత్రాన వెంటనే సమస్యలు పరిష్కారం కాబోవని ఇందిరా గాంధీ అన్నట్లు ఆయన తెలిపారు. వెనకుబాటు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరి కాదని ఇందిరా గాంధీ అన్నట్లు తెలిపారు. తెలంగాణ కన్నా రాయలసీమ, శ్రీకాకుళం వెనకబడి ఉన్నాయని ఇందిరా గాంధీ అన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదని కూడా ఇందిరా గాంధీ అన్నట్లు ఆయన అన్నారు.

- భాషా సంయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక ప్రధానమని ఇందిరా గాంధీ చెప్పినట్లు కిరణ్ రెడ్డి తెలిపారు. విశాలాంధ్ర తెలుగు ప్రజల ఆకాంక్షగా తాను గుర్తించినట్లు ఇందిరా గాంధీ చెప్పినట్లు తెలిపారు. తెలుగువారంటే ఇందిరా గాంధీకి అభిమానమని, వారు రాష్ట్రానికీ దేశానికీ వ్యతిరేకంగా పనిచేయరని అన్నట్లు తెలిపారు.

- తెరాస సభ్యులు అభ్యంతరం చెప్పడంతో తన మిత్రుల ఉద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

- మరోసారి తెరాస సభ్యులు స్పీకర్ వెల్‌లోకి వచ్చారు. మీకు అవకాశం ఇస్తాను, వెనక్కి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించారు. అయినా వారు వినలేదు.

- 1985లో 610 జీవో వచ్చిందని, వివిధ విషయాలను అధ్యయనం చేశారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జయభారత్ కమిటీని రాయలసీమ ఉద్యోగుల కోసం వేశారని ఆయన చెప్పారు. 58వేలకు పైగా స్థానికేతర ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులున్నారనేది నిజమేనని, ఆంధ్రలో ఇతర ప్రాంతాల వారు 30 వేల మందికి పైగా ఉన్నారని, రాయలసీమలో 11 వేలకు పైగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, తెలంగాణ ఉద్యోగాలు పోయాయని మాట్లాడుతున్నారని, అది నిజం కాదని, స్థానిక అంశాన్ని తిరిగి తోడలేమని జయభారత్ రెడ్డి కమిటీ చెప్పిందని ఆయన వివరించారు.

- 610 జీవోపై 1985 నుంచి జరుగుతోందని, పలు కమిటీలు వేశామని, 18 వేల 856 ఉద్యోగాల్లో పైగా బయటివాళ్లు తెలంగాణలో ఉన్నారని, వీరిలో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. 14,794 మందిని మాత్రమే వెనక్కి పంపించాల్సి ఉందని, వెనక్కి పంపించాల్సినవారు పది మంది మాత్రమే ఉన్నారని, మిగతా వారందరినీ వెనక్కి పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వివరించారు. హోంశాఖలో, పాఠశాల విద్యాశాఖలో ఉన్న స్థానికేతరులను వెనక్కి పంపుతూ ఆదేశాలు వెళ్లాయా, లేదా అనేది చూడాల్సి ఉందని ఆయన అన్నారు.

- తెరాస వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు.

- తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఎన్డీయె ప్రభుత్వ హయాంలో అప్పటి హోం మంత్రి ఎల్‌కె అద్వానీ చెప్పిన విషయాన్ని కిరణ్ రెడ్డి గుర్తు చేశారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంం వచ్చినప్పుడు మహారాష్ట్ర శానససభ తీర్మానం చేస్తే పరిశీలిస్తామని అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే ఏకాభిప్రాయం ఉండాలని అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చిదంబరం ప్రకటన ఏం చెప్పారో చూడాలని ఆయన అన్నారు.

- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయాలని అప్పటి హోం మంత్రి చిదంబరం కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు.

- హోంమంత్రులుగా ఉన్న అద్వానీ, చిదంబరం శాసనసభ తీర్మానం కావాలని అన్నారని, అప్పుడు అలా అన్నప్పుడు ఇప్పుడు తీర్మానాన్ని శాసనసభకు తీర్మానం ఎందుకు పంపించలేదని ఆయన అన్నారు. ఈ ప్రశ్న దురదృష్టవశాత్తు తమ ప్రభుత్వాన్ని అడగాల్సి వచ్చిందని ఆయన అన్నారు. న్యాయపరమైన కమిటీనో, పార్లమెంటరీ కమిటీనో, అధికారుల కమిటీనో వేసి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే మూడు రాష్ట్రాలు ఏర్పాటైనట్లు ఆయన తెలిపారు.

- రెండు సార్లు శాసనసభకు వస్తుందని తమ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తీర్మానం, బిల్లు శాసనసభకు వస్తాయని చెప్పారని ఆయన అన్నారు. సంప్రదాయాలను, నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని తాను లేఖలు రాశారని ఆయన చెప్పారు. పాత పద్ధతులు, విధానాలను తెలంగాణపై పాటిస్తామని చిదంబరం రాజ్యసభలో కూడా చెప్పారని ఆయన అన్నారు.

-2004 ఎన్నికల్లో తాము తెరాసతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేనని, తాము రెండో ఎస్సార్సీకి అంగీకరించామని, తెంలగాణపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో చెప్పిందని ఆయన అన్నారు.

- శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

- ఆంద్ర, తెలంగాణ ప్రాంతం విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మేలు జరిగిందా, కీడు జరిగిందా చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 57 ఏళ్ల వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఉద్యమాలు జరిగినప్పుడు కూడా చాలా పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని ఆయన అన్నారు. ఏయే పరిశ్రమలు వచ్చాయో ఆయన వివరించారు.

- రాష్ట్ర విభజన జరిగితే వనరులు తగ్గుతాయని, దానివల్ల అవకాశాలు సన్నగిల్లుతాయని ఆయన అన్నారు. కలిసి ఉన్నాం కాబట్టే సంక్షేమ పథకాలు అమలు చేయగలుతున్నామని చెప్పారు. అనేక జాతీయ పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు ఇక్కడికి వచ్చాయి, వస్తున్నాయని చెప్పారు.

- అనేక అంతర్జాతీయ సమ్మేళనాలకు హైదరాబాద్ వేదికగా మారిందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రధాన కేంద్రంగా ఉంది కాబట్టి అన్నీ హైదరాబాదుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు.

- కృష్ణాగోదావరి జీవనదుల వల్ల కలిసి ఉంటే మేలు జరుగుతుందని అప్పుడు చెప్పారని ఆయన అన్నారు. దీనివల్ల తెలంగాణకు, ఆంధ్రకు, రాయలసీమకు ఎలా మేలు జరిగిందీ చెప్పాల్సిన అవసరం ఉందని కిరణ్ రెడ్డి అన్నారు. 1956లో తెలంగాణ వేరే రాష్ట్రంగా, ఆంద్ర, రాయలసీమలు వేరు ప్రాంతాలుగా ఉంటే ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు.

- గుంటూరు, నల్లగొండ జిల్లాల ప్రజలు 70వేల ఎకరాల భూములను త్యాగం చేశారని, కుటుంబాలను స్థానభ్రంశం కల్పించారని, మన ప్రాజెక్టు కట్టుకుంటే మేలు జరుగుతుందని త్యాగం చేశారని ఆయన చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 80 వేల ఎకరాలు మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాలవారు త్యాగం చేశారని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు కోసం 28 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

- విభజన వల్ల తెలంగాణకు కూడా ఎలా నష్టం జరుగుతుందనేది చెప్పడానికే ప్రయత్నిస్తున్నానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

- తాను చాలా వివరాల్లోకి వెళ్లకుండా మీరు స్పష్టం చేయాల్సింది ఉందని, పాయింట్ ఆర్డర్ లేవనెత్తుతున్నానని జానా రెడ్డి స్పీకర్‌తో అన్నారు.

- రాష్ట్ర ఏర్పాటు విషయంలో శాసనసభకు గానీ శాసనసభ్యులకు గానీ అభిప్రాయం చెప్పడానికే వీలుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని జానారెడ్డి అన్నారు. లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది ఇక్కడి అంశం కాదని ఆయన అన్నారు. రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన తర్వాత ఇందిరా గాంధీ, అద్వానీ, ఎవరేమి చెప్పినా అప్రస్తుతమని ఆయన అన్నారు. బిల్లు మీద మాత్రమే చర్చించాలని ఆయన అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, రాజ్యాంగ ప్రకారం వచ్చిన బిల్లు ఇదని, రాజ్యాంగ హోదాలో ఉన్నవాళ్లం బిల్లులోని అంశాలపై మాత్రమే మాట్లాడాలని, ఓటింగు కూడా అవసరం లేదని ఆయన అన్నారు. ఎంత మంది అవునని అన్నారో, ఎంత మంది కాదన్నారో చెప్పండని ఆయన అన్నారు. ఓటింగు ఉండదని ఆయన అన్నారు. అభిప్రాయాలు మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు. ఒక్కో అంశంపై ఎన్ని అభిప్రాయాలు వచ్చాయో లెక్క కట్టి పంపించాలని ఆయన అన్నారు. 200 మంది అభిప్రాయాలు వస్తే రెండు వందల మంది అభిప్రాయాలు పంపించాలని ఆయన అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం వచ్చినప్పుడు తీర్మానం అవసరం లేదని జానా రెడ్డి అన్నారు.

- ఆర్టికల్ 3, బిల్లుపై తాను రేపు మాట్లాడుతానని, రాజ్యాంగం ఏం చెబుతుందో తాను చెబుతానని, తెలంగాణలో జరిగిన అభివృద్ధి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణవాళ్లకు ఉన్న కోపాన్ని తొలగించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.

- 610 జీవో గురించి చెబుతూ పది మాత్రమే ఉన్నాయని చెప్పారని, ఆ వివరాలను సభ ముందుంచాలని తెలుగుదేశం సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రాజ్యాంగం ప్రకారం వచ్చిన బిల్లును వ్యతిరేకించడంపై రూలింగ్ ఇవ్వాలని ఆయన కోరారు.

- సభా హక్కులను ఉల్లంఘించి కిరణ్ రెడ్డి మాట్లాడారని, దురదృష్టకరమైన పదవిలో కిరణ్ రెడ్డి ఉండాల్సిన అవసరం లేదని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన కోరారు. సభలో కిరణ్ రెడ్డి ఆ రోజు ఓ మాట మాట్లాడారని, ఈ రోజు ఓ మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆ రికార్డులను సభ ముందుంచాలని ఆయన కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనేది కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లబోనని, కాంగ్రెసు అధిష్టానమూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారని ఆయన అన్నారు.

- తెలంగాణకు ఎవరూ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు.

- ముఖ్యమంత్రి చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతారని అనుకున్నానని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం రావాలని తాము ఉద్యమం జరిపామని, విశాలాంధ్ర రాకుండా చేసి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెచ్చారని, ప్రజల రాకుండా చేశారని సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. ఇందిరా గాంధీ బేగంపేటలో విమానాశ్రయంలో అన్న మాటలను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లను కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం కాల్చి చంపుతుంటే ఇంత రక్తపాతమా అని అడిగారని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఇందిరా గాంధీ మాట మార్చారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మాటల్లో పస లేదని ఆయన అన్నారు.

- ముఖ్యమంత్రి తప్పుడు సమయంలో తప్పుడు ప్రసంగమని బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి అన్నారు. పెళ్లి కుదిరి, పెళ్లయిన తర్వాత జాతకాలు కుదరలేదన్నట్లు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలతో ఆటలాడుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు కుమ్మలాటకు వేదికగా చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

- సభా నాయకుడి బాధ్యతలేమిటనే నిబంధనలను మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ చదివి వినిపించారు. ప్రభుత్వం, అధికార పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. సభా నాయకుడి అభిప్రాయాలు ప్రభుత్వ అభిప్రాయాలా, కాదా అనే విషయంపై రూలింగ్ ఇవ్వాలని ఆయన స్పీకర్‌ను కోరారు. తీర్మానం గానీ, ఓటింగు గానీ ప్రతిపాదించాలని అనుకున్నప్పుడు స్పీకర్‌కు చెప్పాలని ఆయన అన్నారు. బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. బిఎసి సమావేశం ఏర్పాటు చేసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని ఆయన అన్నారు. చర్చకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఓటింగ్ పెట్టాలా, తీర్మానాన్ని ప్రతిపాదించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

- సంప్రదాయాలు, నిబంధనల మేరకే సభా వ్యవహారాలు నడుస్తాయని స్పీకర్ హామీ ఇచ్చారు.

- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం రేపు (గురువారం) కూడా కొనసాగుతుందని చెప్పారు. సభను రేపటికి వాయిదా వేశారు.

English summary
CM Kiran kumar Reddy has started his speech in assembly on Telangana draft bill today evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X