
జగన్ కు లోన్ యాప్స్ సవాల్ ! మంత్రులకే బెదిరింపులు- గ్యాంబ్లింగ్ లా క్లోజ్ చేయలేరా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ (జూదం)పై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఈ జూదంలో పాల్గొని వేల కుటుంబాలు బాధితులుగా మారుతున్న వైనంపై స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అప్పట్లో ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కానీ, ఇతర పెద్దలు కానీ ఈ జూదంలో బాధితులు కాలేదు. కానీ సాధారణ ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు లోన్ యాప్స్ మాత్రం తమకేమాత్రం సంబంధం లేని అప్పుల్ని కట్టమంటూ ఏకంగా మంత్రుల్నే బెదిరించే స్ధాయికి వెళ్తున్నా సర్కార్ లో స్పందన కనిపించడం లేదు.

లోన్ యాప్స్ అరాచకాలు
ఈ రోజుల్లో అప్పుతో పనిలేని వారంటూ ఎవరూ లేరు. కరోనా తెచ్చిన ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఇంకా జనం బయట పడటం లేదు. అప్పులేకపోతే ప్రభుత్వాలే రోజూ ఏ పనీ చేయలేని పరిస్ధితికి వచ్చేశాయి. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది. సరిగ్గా దీన్నే సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన లోన్ యాప్స్.. రెచ్చిపోతున్నాయి. మనం తీసుకున్న అప్పుకు మనల్ని ప్రశ్నిస్తే ఏదోలా సమాధానం చెప్పుకుంటాం. డబ్బులుంటే తీర్చేస్తాం. కానీ ఎవరో చేసిన అప్పు మనల్ని తీర్చమంటే ఏం చేయగలం, ఏమని సమాధానం చెప్పుకోగలం. సాధారణ పౌరుల సంగతి సరే ఏకంగా జనం కష్టాలు తీర్చాల్సిన మంత్రులనే ఎవరి బాకీలో తీర్చమంటే వారు కూడా ఏమీ చేయలేకపోతే ఆ పరిస్ధితి ఇంకెవరికి చెప్పుకోవాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జగన్ తాజా, మాజీ మంత్రులకు సెగ
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అదే జిల్లాలో ఉన్న తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు లోన్ యాప్స్ నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చేదు అనుభవాలే కాదు బెదిరింపులు కూడా. ఇందులో కాకాణి పోలీసుల సాయంతో రూ.25 వేలు ఇచ్చి మరీ ట్రాప్ చేసి నిందితుల్ని అరెస్టు చేయించగా.. మాజీ మంత్రి అనిల్ మాత్రం ఇంకా ఈ వేధింపులతోనే కాలం గడుపుతున్నట్లు తాజాగా లీకైన ఆడియో క్లిప్ చెబుతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో,అదీ పార్టీకి గట్టి పట్టున్న నెల్లూరు జిల్లాలోనే తమ నేతల పరిస్ధితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సగటు ప్రజల పరిస్దితి ఏంటనేది వైసీపీ ప్రభుత్వానికి తెలియంది కాదు.

లోన్ యాప్స్ పై జగన్ సర్కార్ మౌనం
లోన్ యాప్స్ విషయంలో సాధారణ ప్రజల నుంచి తమ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రుల వరకూ ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జగన్ సర్కార్ మాత్రం మౌనంగా ఉండిపోతోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి లోన్ యాప్స్ వంటి ఆగడాల్ని అడ్డుకోవడం పెద్ద పనేం కాదు. సినిమా టికెట్లు, జూదం, లాటరీలు, చేపలు వంటి విషయాల్లో సామాన్య ప్రజల ప్రయోజనాల పేరుతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ ఇప్పుడు లోన్ యాప్స్ పై మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది.

లోన్ యాప్స్ ను అడ్డుకోలేరా ?
ఇప్పటికే ఆన్ లైన్ జూదాన్ని ఏపీలో నిషేధించడం ద్వారా పలు జాతీయ, అంతర్జాతీయ గ్యాంబ్లింగ్ సంస్ధలకు జగన్ సర్కార్ గతంలో షాకిచ్చింది. ఇప్పటికీ ఆయా సంస్ధలు ఏపీలో అడుగుపెట్టేందుకు సాహసించడం లేదు. కానీ సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వ పెద్దల వరకూ అందరినీ వేధిస్తున్న లోన్ యాప్స్ ను మాత్రం ప్రభుత్వం అడ్డుకోలేకపోతోంది. కనీసం దీనిపై ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన కూడా చేసేందుకు ధైర్యం చేయడం లేదు. దీనికి గల కారణాలు మాత్రం అంతుబట్టడం లేదు. దీంతో లోన్ యాప్స్ మాఫియాకు ప్రభుత్వం భయపడుతోందా ? కుమ్మక్కైందా ? ఏమీ చేయలేని పరిస్ధితుల్లోకి జారిపోతోందా ? కేంద్రం సహకరించడం లేదా ? దేశవ్యాప్తంగా విస్తరించిన లోన్ యాప్స్ మాఫియాను కేవలం ఏపీలో అడ్డుకోవడం కష్టమేనా ? ఇలా సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి.