మూటలో కరెన్సీ నోట్లు: బెజవాడలో నడి రోడ్డుపై రూ.10 లక్షలు
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో నడి రోడ్డు పైన పది లక్షల రూపాయలు పడిపోయాయి. ఆ డబ్బులు ఓ సంచిలో ఉండటంతో స్థానికులు దానిని గుర్తించి పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బుధవారం నాడు జరిగింది.
మొగల్రాజపురంలోని భాష్యం పాఠశాల వద్ద ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నాడు. హఠాత్తుగా ఆయన వాహనం పైనుంచి ఓ మూట పడింది. దానిని స్థానికులు గుర్తించారు. అతనిని పిలిచే ప్రయత్నం చేశారు. ఎంతగా కేకలు వేసినా అతనికి వినిపించలేదు. అతను వెళ్లిపోయాడు.

దీంతో, ఆ మూటను పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు స్థానికులు అప్పగించారు. దానిని తెరిచి చూడగా.. అందులో రూ.500, రూ.1000 నోట్ల కట్టలు ఉన్నాయి. అవి మొత్తం దాదాపు పది లక్షల రూపాయలు ఉంటాయని భావిస్తున్నారు.
తాము అతనిని ఎంతగా పిలిచినా పలకలేదని, అతనిని పిలిచేందుకు ప్రయత్నించామని, కానీ బైక్ నెంబర్ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఉంటే అతని బైక్ నెంబర్ ఆధారంగా గుర్తించే అవకాశాలున్నాయి. లేదా ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications