అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే ఆ గ్రామాల్లో జగన్ ధనదాహం; లోకేష్ సంచలనం
జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు జనజీవనం అతలాకుతలమైంది అని, ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించిందని, అందుకు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు నారా లోకేష్. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణమని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

అన్నమయ్య ప్రాజెక్ట్ పరిసర గ్రామాల్లో జరుగుతుంది ఇదే
ఇసుక మాఫియా కోసం నీటిని దిగువకు విడుదల చెయ్యలేదని, వరద వచ్చిన సమయంలో ఇసుక టిప్పర్లు అక్కడ ఉన్నాయని, విపరీతంగా వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని, ఇందువల్లే ప్రాణ నష్టం జరిగిందని దీనికి వైసిపి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని లోకేష్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కన్నీళ్ళ ఆరకముందే అన్నమయ్య ప్రాజెక్టు పరిసర గ్రామాలలో ఏం జరుగుతుందో చెబుతూ లోకేష్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

మళ్లీ ఇసుక ట్రాక్టర్లు గ్రామాలలో బారులు తీరాయన్న లోకేష్
నందలూరు మండలం ఆడవూరు ఇసుక క్వారీలో ఆదివారం నుంచి ఇసుక విక్రయాలు ప్రారంభించారని, చెయ్యేరు వరదలతో ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయాయని, పలువురు మరణించారని ఆ విషాదం నుండి బయటపడక ముందే మళ్లీ ఇసుక ట్రాక్టర్లు గ్రామాలలో బారులు తీరాయని ఓ పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసిన లోకేష్ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. వైసిపి ఇసుకాసురుల అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందని పేర్కొన్న లోకేష్, అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయి అంటే వైయస్ జగన్ గారికి జనం కంటే ధనమే ముఖ్యమని అర్థమవుతోందని పేర్కొన్నారు.

బాధితులకు కనీస న్యాయం జరగకముందే వైసీపీ నాయకుల ధనదాహం..
అంతేకాదు వైసిపి నాయకుల ధన దాహానికి 39 మంది జలసమాధి అయ్యారని, 12 గ్రామాలు నీట మునిగాయని 1721 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని లోకేష్ పేర్కొన్నారు. బాధితులకు కనీస న్యాయం జరగక ముందే కడప జిల్లా నందలూరు మండలం ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని లోకేష్ జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలప్రళయానికి కారణమైన ఇసుక మాఫియా ను కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే వారికి అండగా నిలవడం బాధాకరం అంటూ లోకేష్ పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ లు కొట్టుకుపోవటం వెనుక ఇసుక మాఫియా
అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోవడం వెనుక ఇసుక మాఫియా ఉందని ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన లోకేష్ మళ్లీ ప్రస్తుతం ఇసుక విక్రయాలు ప్రారంభించడం పై జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఒక్క లోకేష్ మాత్రమే కాదు అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై కేంద్రం కూడా అసహనం వ్యక్తం చేస్తుంది.
ఏపీ బీజేపీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు ప్రతిపక్షాల విమర్శలపై ఎదురు దాడి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులను మానవ తప్పిదంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications