ఏపీకి పొంచివున్న తుఫాన్
Low pressure over Bay Of Bengal: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొంది. అల్పపీడనంగా మారిన అనంతరం 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతం పశ్చిమ- మధ్య వాయవ్య దిశలో దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఈ అల్పపీడనం ఏర్పడొచ్చు. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడటానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.
అల్పపీడన ప్రభావంతో ఈ రాత్రికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని వాతావరణం కేంద్రం అభిప్రాయపడింది. క్రమంగా అవి ఉధృత రూపాన్ని ధరిస్తాయని, ఈ నెల 29వ తేదీ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
కొద్దిరోజులుగా నైరుతి రుతుపవనాలు మందగించిన విషయం తెలిసిందే. చురుకుగా కదులుతాయని, రాష్ట్రమంతటా విస్తరిస్తాయని మొదట్లో అంచనా వేశారు గానీ అది సాధ్యపడలేదు. సముద్ర ఉపరితలం మీదుగా వ్యతిరేక దిశలో వీస్లోన్న బలమైన గాలుల వల్ల అవి కదలట్లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల వల్ల సంభవించిన లోటు వర్షాన్ని అల్పపీడనం భర్తీ చేయొచ్చని అంచనా వేస్తోన్నారు.












Click it and Unblock the Notifications