weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిసా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి జల్లులతోపాటు మోస్తరు వానలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తులు, నిర్వహణ సంస్థ తెలియజేసింది.
వరద ప్రవాహాన్ని పరిశీలించాలి
ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు కురవనున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తుల సంస్థలో ఉన్న రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రాన్ని సందర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నైరుతి రుతుపవనాలవల్ల వర్షాలు అత్యధికంగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అనిత సూచనలు జారీచేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని, ఏదైనా ప్రమాదం సంభవించిన వెంటనే వారిని అప్రమత్తం చేయాలన్నారు.
జూన్ నెలలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకాగా, ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం, తొమ్మిది జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు మంత్రి అనిత వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు, సంభవించే వరదలపై అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ప్రమాదం సంభవించినా వెంటనే సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications