భారీ హెచ్చరిక: ఏపీపై తుపాను ఎఫెక్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురవనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని, రేపటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాయుగుండం తుపానుగా మారిన తర్వాత ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరంవైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.
గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయని, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యాకారులను వెంటనే వెనక్కి పిలిపించాలని ప్రభుత్వానికి సూచించింది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీరంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పంట పొలాల్లో నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని, లేదంటే అధిక నీటి సామర్థ్యంతో పంటలు దెబ్బతింటాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. బుధవారం, గురువారం, శుక్రవారం రాయలసీమతోపాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

రేపటి నుంచి భారీ వర్షాలు
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే గురువారంనాడు అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, సత్యసాయి, నెల్లూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే బాపట్ల, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతరామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం, శనివారం కూడా ఇవే జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపారు.












Click it and Unblock the Notifications