ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావం వల్ల మొన్నటివరకూ ఏపీలో అతి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. ఈ వర్షాల తీవ్రత రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉండబోతోంది. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడటమే దీనికి కారణం. ఇది 2.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది.

ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా బీ చెర్లపల్లిలో 65.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట- 45,, నెల్లూరు జి రాపూరులో 40.5, విజయవాడ తూర్పులో 39 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ పిడుగులు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ సూచించారు. పడే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద తలదాచుకోవద్దని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications