Maha shivratri 2024 : మహాశివరాత్రి 2024 నేటినుండి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు షురూ.. షెడ్యూల్ ఇలా!!
శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి ఒకటవ తేదీ నేటి నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి శ్రీశైలం ముస్తాబయ్యింది. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తుంది.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుండి అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని, శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. నేడు ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఇక మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విషయానికొస్తే మార్చి ఒకటవ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టుబట్టలు సమర్పిస్తారు. మార్చి రెండవ తేదీన బృంగి వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు.
మార్చి మూడవ తేదీన హంస వాహన సేవ నిర్వహించి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మార్చి 4వ తేదీన మయూరి వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. మార్చి 5వ తేదీన రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది.
మార్చి ఆరో తేదీన పుష్ప పల్లకి సేవను, మార్చి 7వ తేదీన గజ వాహన సేవను నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే రోజు స్వామివారికి ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
మార్చి 9వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. మార్చి 10వ తేదీన ధ్వజావరోహణం నిర్వహిస్తారు. మార్చి 11వ తేదీన అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం వంటి కార్యక్రమాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నల్లమల అటవీ ప్రాంతం నుండి రాత్రి వేళల్లో కూడా రాకపోకలను అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications