హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడు: 'తెలంగాణ కోసం బాబు లేఖ రాస్తే నేడు తెరాసలో ఉన్న నేతలే వద్దన్నారు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ రెండో రోజైన గురువారం నాడు మహానాడులో ప్రసంగించారు. ఆయన ఎన్టీఆర్ నివాళిపై తీర్మానం పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Mahanadu second day: Balakrishna speech

టీడీపీ అధ్యక్ష పదవికి చంద్రబాబు పేరును ప్రతిపాదిస్తూ ఆరు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీని జాతీయ పార్టీగా మార్చుతున్న నేపథ్యంలో తెలుగుదేశం కాకుండా భారత దేశంలో తెలుగుదేశంగా మార్చారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఇద్దరు అధ్యక్షులు ఉంటారు.

ఎర్రబెల్లి నిప్పులు

తెరాస ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నెరవేర్చడం లేదని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పేదలకు ఇల్లు కట్టిస్తానని చెప్పారని, కానీ ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు. ఖబడ్దార్ కేసీఆర్ టీడీపీ నీ అంతు చూస్తుందన్నారు.

తెరాస మంత్రివర్గంలో ఉన్న వారంతా తెలంగాణ ద్రోహులే అన్నారు. తెలంగాణ కోసం చంద్రబాబు లేఖ రాశాడని, ఆ లేఖకు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌లు అడ్డుపడ్డారని అది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

బాబుపై కవిత

మహానాడు వేదికపై చంద్రబాబుపై ఓ చిన్నారి కవిత వినిపించారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రస్తావిస్తూ, వాటిని బాబు తీరుస్తారని చెబుతూ హేమమాలిని అనే చిన్నారి కవిత వినిపించింది.

కృష్ణా జలాలను హైదరాబాద్ నగరానికి తొమ్మిది నెలల్లో తీసుకు వచ్చామని చెప్పారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నారు. 2019లో తెలంగాణలో టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పారు. తాము బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడామన్నారు. తాము నాడు అభివృద్ధి చేసింది, ఆర్థికంగా నిలబెట్టింది ప్రజల కోసమన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవలొద్దని, పరస్పరం సహకరించుకుందామని చెప్పారు. తెరాస ప్రజల కోసం పని చేస్తే ఇబ్బంది లేదని, అలా కాకుండే ఖబడ్దార్ అన్నారు. కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధమన్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే ఖబడ్దార్ అన్నారు. మీకు అండగా నిలబడతామన్నారు.

ఎవరి గడ్డి వేస్తే అటు

టీడీపీలో ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచి, పార్టీకి చెందిన పలువురు నేతలు తెరాసలో చేరిన అంశంపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో లేనివాళ్లను ఎమ్మెల్యేలుగా, నేతలుగా చేశామని, అలాంటి వారి పోతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఓ పొట్టేలు కథ చెప్పి ఆకట్టుకున్నారు.

పొట్టేలుకు ఉన్న విశ్వసనీయత వీరికి లేదన్నారు. ఎవరు గడ్డి వేస్తే వారి వైపు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఒక నాయకుడు పోతే వందమందిని తయారు చేస్తామన్నారు. అవకాశవాదులు పోతే నిజమైన కార్యకర్తలకు అవకాశం వస్తుందన్నారు.

బాబ్లీ పైన పోరాటంలో తమను అరెస్టు చేశారన్నారు. సమస్యల పైన తెలుగు ప్రభుత్వాలు చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో మంచి కళాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజక్టు పైన మన నాయకులు పాదయాత్ర చేశారన్నారు. మహానాడులో అందరూ బుల్లెట్‌లా దూసుకుపోతున్నారని చెప్పారు.

గవర్నర్‌ను కాకున్నా కేసీఆర్‌ను ఓడిస్తా: మోత్కుపల్లి, అరిచేవారెవరు: బాబు

చంద్రబాబు తనను గవర్నర్ చేస్తానని చెప్పారని, తాను గవర్నర్ అయినా కాకపోయినా కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యమని మోత్కుపల్లి అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మీరు గవర్నర్ అయితే ఇక్కడ అరిచేవారెవరని చమత్కరించారు.

దీనిపై మోత్కుపల్లి మాట్లాడుతూ... మీరు ఏవిధంగా తనను వాడుకున్నా తూచ తప్పకుండా పాటిస్తానన్నారు. టీడీపీలో ఉన్న చరిత్రకారులు కొంతమంది ఉన్నారని, తమ చరిత్రను తమకు ఉంచగలిగితే చాలన్నారు.

కొంతమంది గుంటనక్కలు మన పార్టీలో ఉండి వేరే వారితో చేతులు కలిపి తమలాంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆత్మగౌరవంతో బతకడమే తన లక్ష్యమని చెప్పారు. మీరిచ్చిన అవకాశం ఏదైనా దానికి వన్నె తెస్తానన్నారు.

మీడియాను శాసించే అధికారం కేసీఆర్‌కులేదన్నారు. కేసీఆర్ ఓ అబద్దాల కోరు అని, ఎన్నికల ముందు దళితుడిని సీఎం చేస్తానని, గెలిచాక ఆయన ఆ పీఠంపై కూర్చున్నారన్నారు. అమరవీరులు, ఓయు విద్యార్థులను కేసీఆర్ మరిచారన్నారు.

లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి ఇవ్వలేదన్నారు. కేబినెట్లో మాల, మాదిగలకు, మహిళలకు చోటు లేదన్నారు. కాంట్రాక్టర్ల కోసమే తెరాస ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

రూ.400 కోట్లతో ఎన్టీఆర్ ధోవతి, చీర కార్యక్రమం

రూ.400 కోట్లతో ఎన్టీఆర్ ధోవతి, చీర కార్యక్రమం ప్రవేశ పెడతామని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమం కేవలం ప్రజలకే కాకుండా చేనేత కార్మికులకు కూడా చేయూతను అందించేలా ఉంటుందన్నారు. అలాగే, గోదావరి పుష్కర ఘాట్ వద్ద శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని నిర్ణయించారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

తెలుగు వారికి ఏ విపత్తు వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చిన మానవతావాది ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చక్రం తిప్పారన్నారు.

జాతీయ పార్టీగా మార్చుకున్నా: యనమల

జాతీయ పార్టీగా మారినా పేరు మార్చుకునే అవసరం రాదని యనమల రామకృష్ముడు అన్నారు. ఇవాళ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పారు. జాతీయ పార్టీగా మార్చుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు లేవన్నారు. జాతీయ పార్టీగా మారినా గుర్తు మార్చుకునే అవకాశం లేదన్నారు. అండమాన్ నికోబర్, కర్నాటక, యానాం తదితర ప్రాంతాల్లో పార్టీని విస్తరిస్తామని చెప్పారు.

జన్మ ధన్యం: అశోక గజపతి రాజు

ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావటం తనకు కలిగిన గొప్ప అవకాశమని, దాంతో తన జీవితం ధన్యమైందని కేంద్రమంత్రి అశోక గజపతిరాజు అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్‌ పెద్దపీట వేశారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్‌ మార్గాన్ని అనుసరించాయని పేర్కొన్నారు. అభివృద్ధి కుంటుపడకుండా ఎన్టీఆర్‌ పాలన సాగిందన్నారు.

బాలకృష్ణ ప్రసంగం

జాతీయ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటి పైకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. పేదవాడికి కనీస అవసరాలు తీర్చిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించారన్నారు. మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎన్టీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

బడుగు, బలహీనవర్గాలని అధికారంలోకి తెచ్చారన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడగలిగేది చంద్రబాబు మాత్రమేనని నమ్మి ప్రజలు ఓటేశారన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న బాలకృష్ణ

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మనం తప్పకుండా అధికారంలోకి వస్తామని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. నేను హిందూపురంకే పరిమితం కాదని, రాష్ట్రం మొత్తం చూసుకుంటానని చెప్పారు.

దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడక!

రెండో రోజు మహానాడు కార్యక్రమంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే, జిల్లాల నుండి వస్తున్న వాహనాలను శివార్లలోనే డైవర్ట్ చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లవలసి వస్తోంది. బుధవారం ఆపలేదని, ఈరోజు ఆపడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

English summary
Mahanadu second day: Balakrishna speech
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X