TDPలో చేరనున్న మహాసేన రాజేష్
దళితులను తెలుగుదేశం పార్టీవైపు మళ్లించడానికి మహాసేన రాజేష్ ఉపయోగపడతారని పార్టీ భావిస్తోంది.
కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరుచుగా వినిపించే పేరు మహాసేన రాజేష్. అధికార ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే రాజేష్ మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుణ్ని, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని కలిశారు. పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు అంగీకరించారు. అరగంట పాటు జరిగిన భేటీలో పార్టీలో చేరిన తర్వాత తీసుకోవాల్సిన బాధ్యతలు, ప్రభుత్వంపై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.చంద్రబాబునాయుడు ఈనెల 16వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఒకరోజు ముందుగా 15వ తేదీన రాజేష్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేష్ దళిత వర్గాల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నికలైన తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా మారారు. పోలీసులు అర్థరాత్రి సమయాల్లో అరెస్ట్ చేసినప్పటికీ వెనకడుగు వేయకుండా మహాసేన మీడియాతో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది కానీ టీడీపీవైపు మొగ్గుచూపారు. గోదావరి జిల్లాల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం కనపడుతోందనే అంచనాలున్నాయి.

గోదావరి జిల్లాల్లో దళిత వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే అభిప్రాయంతో పోరాటం చేయడంద్వారా ఆయనకు వారిలో గుర్తింపు వచ్చింది. దళితులను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా చేయడంతోపాటు వారిని ఏకతాటిపైకి తెచ్చి పార్టీకి ప్రయోజనం కలిగేలా చేయాలనేది పార్టీ ఆలోచనగా ఉంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో అత్యధికం వైసీపీవైపు మొగ్గుచూపుతున్నాయి. వారిని తెలుగుదేశం పార్టీవైపు మళ్లించడానికి ఒక బలమైన నేత అవసరమవుతోంది. ఆ అవసరం మహాసేన రాజేష్ ద్వారా నెరవేరుతుందని పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications