మజ్జి శ్రీను బాటలోనే మరో వైసీపీ ముఖ్య నేత, కొత్త లెక్కలు ..!?
ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మజ్జి శ్రీను వైసీపీ వీడి టీడీపీ లో చేరారు. ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్ తో పాటుగా మజ్జి శ్రీనుకు పదవి పైన టీడీపీ నేతల నుంచి హామీ దక్కింది. దీంతో.. కూటమి నేతలను కలిసి వారి మద్దతు కోరుతున్నారు. అయితే, వైసీపీలో మజ్జి శ్రీను మద్దతు దారుల్లో ఇప్పుడు ఆలోచన మొదలైంది. అందులో ఒక నియోజకవర్గ నేత సైతం ఉన్నారు. చిన్న శ్రీనుకు వీర మద్దతు దారుడు అయిన ఆ మాజీ ఎమ్మెల్యే అడుగులు పైన పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
విజయనగరం వైసీపీలో మజ్జి శ్రీను రాజీనామా తరువాత కొత్త చర్చ మొదలైంది.వైసీపీలో కీలక నేతగా ఎదిగిన మజ్జి శ్రీనుకు విజయనగరంలో అనుచరవర్గం ఉంది. చిన్న శ్రీను పార్టీ నుంచి వెళ్లిన తరువాత జిల్లా పార్టీలో కీలక మార్పులు చేసారు. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు. మజ్జి శ్రీను వియ్యంకుడు అప్పలనాయుడును నెల్లిమర్ల నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఆయన స్థానంలో నెల్లిమర్ల జెడ్పీటీసీ సన్యాసి నాయుడుకు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. కాగా..ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గ ఇంఛార్జ్ జోగారావు గురించి ప్రచారం మొదలైంది.ఆయన తొలి నుంచి మజ్జి శ్రీను మద్దతుదారుగా ఉన్నారు. జోగారావు 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు.
చిన్న శ్రీనుకు జోగారావు అత్యంత విశ్వాస పాత్రుడుగా పేరు ఉంది.విజయనగరంలోని చిన్న శ్రీను ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తారు. గతంలో పార్వతీపురం బహిరంగ సభల్లో చిన్న శ్రీనును గురువుగా సంబోధించారు.తనకు అన్నీ చిన్న శ్రీనే అని చెప్తూ సాష్టాంగ నమస్కారం చేశారు. కాగా.. అక్కడ కూటమి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంటున్న అక్రమాలు.. ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.భూ వివాదాలు, పంచాయితీలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉండటంతో జోగారావు చిన్న శ్రీను వెంట నడిచేందుకు కాస్త ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు గుసగుసలాడుతున్నారు. జోగారావు వైసీపీలోనే ఉంటే టికెట్ తనకే దక్కే అవకాశం ఉంటుంది.
అయితే, చిన్న శ్రీను టీడీపీలో చేరటంతో... జోగారావు తాను ఇరకాటంలో పడ్డట్టుగా భావిస్తున్నారట. టీడీపీ నుంచి సీటు పైన హామీ వస్తే జోగారావు అటు వెళ్లటం ఖాయమని చెబుతున్నారు. రాజకీయ భవిష్యత్ కావాలనుకుంటే మాత్రం వైసీపీలోనే ఉంటారనే అంచనాలు ఉన్నాయి. మంత్రి లోకేష్ చిన్న శ్రీనును ప్రోత్సహించి జిల్లాలో పెద్దపీట వేస్తే గనుక జోగారావు జంప్ కొట్టడం తథ్యమని ఆయన అనుచరులే బాహాటంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే చిన్న శ్రీనుకు బలమైన అనుచరగణం సీతానగరం మండలం, పార్వతీపురం మండలం,బలిజపేట మండటం కొంత పార్వతీపురం మున్సిపాలిటీలో ఉంది. జోగారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. చిన్న శ్రీను జోగారావుల మధ్య రాజకీయంగా బలమైన బంధం ఉండటంతో.. ఇప్పడు ఈ వైసీపీ నేత అడుగుల పైన పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి పెరుగుతోంది.














Click it and Unblock the Notifications
