హుటాహుటిన రాజు గారి వద్దకు మజ్జి శ్రీను..! రాజీనామా లీకుల వేళ- తేల్చేశారా ?
ఏపీలో నిన్న మొన్నటివరకూ వైసీపీలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasarao) తాజాగా ఆ పార్టీని వీడి టీడీపీలోకి ఫిరాయించారు. కుమార్తె సిరి సహస్రతో కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. అయితే ఈ ఫిరాయింపు వెనుక టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే సమయంలో మజ్జిని ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేస్తే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానంటూ అశోక్ గజపతిరాజు టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మజ్జి శ్రీనివాసరావు ఇవాళ కుమార్తె సహస్రతో కలిసి అశోక్ గజపతి రాజు వద్దకు వెళ్లారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును ఇవాళ ఆయన నివాసం లోక్ భవన్ లో మజ్జి శ్రీనివాసరావు, ఆయన కుమార్తె సిరి సహస్ర కలిశారు. అశోక్ కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు వీరిని వెంట బెట్టుకుని తన తండ్రి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అశోక్ గజపతిరాజుతో మజ్జి శ్రీను, కుమార్తె కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా మజ్జి శ్రీనుకు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చేందుకు అశోక్ అడ్డుపడకుండా ఆయనతో చర్చించినట్లు సమాచారం.

అయితే మజ్జి శ్రీనివాసరావు-అశోక్ గజపతి రాజు మర్యాదపూర్వక భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నదానిపై ఇరువర్గాలూ ఇప్పటివరకూ నోరుమెదపడం లేదు. అయినా ఇన్నాళ్లూ విజయనగరం జిల్లాలో తమను వ్యతిరేకిస్తూ రాజకీయాలు నడిపిన మజ్జికి మంత్రి పదవి లభిస్తే టీడీపీ నేతలకు షాకులు తప్పవన్న ప్రచారం నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చారన్న దానిపై చర్చ జరుగుతోంది. టీడీపీ క్యాడర్ మాత్రం అశోక్ గజపతి రాజు నుంచి మజ్జి ఫ్యామిలీకి ఎలాంటి సహకారం ఉండబోదని చెబుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
