సీఐడీకి వైవీ సుబ్బారెడ్డి షాక్..! పరకామణి కేసు విచారణలో ట్విస్ట్..!
ఏపీలో ప్రముఖ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్దానం పరకామణిలో రెండేళ్ల క్రితం జరిగిన చోరీ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. గత వైసీపీ హయాంలో అక్కడ జరిగిన చోరీ ఘటనపై అప్పట్లో టీటీడీతో ఈ కేసు నిందితుడు రవి కుమార్ రాజీ చేసుకున్నారు. లోక్ అదాలత్ లో టీటీడీకి తన ఆస్తులు రాసిచ్చి రవికుమార్ రాజీ చేసుకున్న తర్వాత ఈ వ్యవహారం సమసిపోయిందని అంతా భావించారు. కానీ కూటమి సర్కార్ మళ్లీ దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో పరకామణిలో చోరీ జరిగిన సమయంలో టీటీడీలో ఉన్న అధికారులు, ఛైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ అప్పట్లో చైర్మన్ గా లేని మాజీ బాస్, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కూడా పిలిపించింది. అయితే విచారణలో పరకామణి చోరీ కేసుతో సంబంధం లేని తననెందుకు పిలిచారని వైవీ సుబ్బారెడ్డి సీఐడీ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఇరుకునపడ్డారు. అయితే తాను దిగిపోయాక చోరీ బయటపడిందన్నారు.

పరకామణి కేసులో ఇవాళ విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి చోరీపై సీఐడీ తనను ప్రశ్నించిందని, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు వెల్లడించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని సీఐడీకి తెలిపారు. తన హయాంలో చోరీ జరిగిందా అని సీఐడీ అడిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే తన పదవీకాలం ముగిశాక ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని ఆయన కోరారు.

వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉండగానే టీటీడీ బోర్డు పరకామణి చోరీ కేసు నిందితుడైన రవికుమార్ నుంచి ఆస్తుల్ని రాజీ కోసం తీసుకుందని సీఐడీ ఆరోపిస్తోంది. ఇలా రవికుమార్ ఆస్తుల్ని తీసుకుని టీటీడీ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం వెనుక జరిగిన లావాదేవీల్ని గుర్తించే పనిలో సీఐడీ ఉంది. ఇందుకోసం అప్పట్లో టీటీడీలో పనిచేసిన వారిని ప్రశ్నినంచడంతో పాటు బ్యాంకు ఖాతాల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications