ప్రేయసి బంధువులే చంపారా?: భర్త అక్రమ సంబంధం, భార్య మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేయసి ఇంట్లో ఓ ప్రేమికుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తాళ్లపూడి మండలం పెద్దేవంలో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే బుధవారం ప్రియురాలి ఇంటికి వెళ్లిన మనోజ్‌కుమార్ అనుమాస్పదంగా మృతి చెందాడు.
అయితే ఉరేసి హత్య చేశారంటూ యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్య కాదు, ఆత్మహత్య చేసుకున్నాడని ప్రేయసి బంధువులు అంటున్నారు. మనోజ్‌కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిడ్నాప్ కేసులో అరెస్టులు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన కేఎస్‌కే వర్మ అనే యువకుడ్ని అపహరించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సిఐ రమేష్ బాబు మీడియా సమావేశంలో ఆయన వివరించారు.
గత నెల 29వ తేదీన చందు అనే యువకుడు వర్మకు ఫోన్ చేసి తనకు చెల్లించాల్సిన బకాయి ఇస్తామని చెప్పడంతో పట్టణంలోని ఝాన్సీలక్ష్మీబాయి పాఠశాల దగ్గరకు కారులో వెళ్లాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతన్ని బంధించి వేరే కారులో పాలకొల్లు వైపు తీసుకెళ్లి అక్కడ్నుంచి బాధితుడి తండ్రికి ఫోను చేశారు.

రూ.12 లక్షలు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో కంగారు పడిన అతని కుటుంబ సభ్యులు రూ.4.25 లక్షలు తీసుకుని వారి వద్దకు వెళ్లి ఇవ్వడంతో విడిచిపెట్టారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కిడ్నాప్‌కు పాల్పడిన చందు, నాయుడు, నాగరాజులను అరెస్టు చేశారు. వారి నుంచి ఉన్న రూ.4.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మహిళ అనుమానాస్పద మృతి
పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో మంగళవారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కుమారదేవం గ్రామానికి చెందిన ఇందుమతి(35)కి 20 ఏళ్ల కిందట దొమ్మేరు గ్రామానికి చెందిన పిట్టా వెంకట్రావుతో పెళ్లయింది. వీరికి పిల్లలు లేరు. కొద్ది నెలల క్రితం ఇందుమతి విదేశాలకు వెళ్లి వచ్చింది.
ఇందుమతి విదేశాల్లో ఉన్న సమయంలో వెంకట్రావు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇందుమతికి, వెంకట్రావుకు తరచూ గొడవలు జరుగుతున్నాయని, మంగళవారం ఉదయం కూడా వీరిద్దరూ గొడవపడ్డారని అంటున్నారు. మధ్యాహ్న సమయంలో వెంకట్రావు రాజమహేంద్రవరం బయలుదేరగా ఇందుమతి ఈ ఉరేసుకుని మరణించినట్లు చెబుతున్నారు.
దీంతో వెంకట్రావు వెనక్కి రావడంతో ఉరివేసుకుని ఉన్న ఇందుమతిని కిందకు దింపారు. పట్టణ సీఐ పి.ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి మెడపై, గడ్డంపై గాయాలు ఉన్నట్లు గుర్తించామని పట్టణ మహిళా ఎస్సై డి.గంగాభవాని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుమతి భర్తను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications