బిడ్డను నేలకేసి కొట్టి చంపాడు: ఘోర ప్రమాదాలు
విజయవాడ: విజయనగరం జిల్లాలోని అనంతగిరి మండలం నందకోటలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తండ్రి మూడేళ్ల కూతురిని నేలకేసి కొట్టి చంపాడు. భార్యపైనా దాడికి పాల్పడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. భార్యా, పిల్లలపై దాడి అనంతరం నిందితుడు విజయనగరం జిల్లా ఎస్‌కోట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, అనంతపురం జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో శనివారం తెల్లవారుజామున 8 మంది మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు దగ్గర శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లారీ-బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 40 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కృష్ణా జిల్లాలో ప్రమాదం...
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లి వద్ద 16వ నెంబర్ జాతీయ రహజారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ప్రమాదకరమైన రసాయనాల టిన్నులతో తణుకు వెళ్తున్న మినీ వ్యాన్ వీరవల్లి పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
రసాయనాల తీవ్రతకు వ్యాన్ ట్రక్కులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందినవారు.












Click it and Unblock the Notifications