భార్యపై అనుమానం: కాల్చి శీల పరీక్ష చేయాలనుకున్న భర్త
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి తన భార్య శీలం పైన అనుమానం పెంచుకున్నాడు. సభ్య సమాజం తల దించుకునేలా ఆమెను శీల పరీక్షకు ఒప్పించాడు. కాల్చిన కర్రును చేతితో పట్టుకుంటే, చేతులు కాలకపోతే శీలవతి అయినట్లు, లేకపోతే శీలం లేనట్లేనని తేల్చారు.
దీనికి ఏం తెలియని ఆ యువతి కూడా అంగీకరించింది. ఆమెకు కర్ర కాల్చి, వాత పెట్టేందుకు భర్త సిద్ధమయ్యాడు. కొందరు పెద్దలను కూడా ఇందుకు అతను ఒప్పించాడని తెలుస్తోంది. అందరూ ఒకచోట చేరిన సమయంలో, అందరి ముందే కాల్చిన కర్రును పట్టుకునేందుకు ఆమె సిద్ధమైంది.

ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. దీంతో హుటాహుటిన వారు అక్కడకు వచ్చారు. ఆ యువతిని శీల పరీక్ష నుంచి కాపాడారు. సొంత భార్య పైన అనుమానం పెంచుకున్న భర్తను అరెస్టు చేశారు. ఇది స్థానికంగా సంచలనం రేపింది.
పోలీసు అధికారి మాట్లాడుతూ.. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం కలిగిన భర్త బాలకృష్ణ మూఢాచార నమ్మకంతో కర్రకాల్చి వాతలు పెట్టాలని చూశారని చెప్పారు. ఈ తీర్పు బుధవారం సాయంత్రం జరగగా, గురువారం ఉదయం అమలు చేయాలని చూశారన్నారు. చేతులు కాలితే తప్పు చేసినట్లు, కాలకుంటే తప్పు చేయనట్లుగా వారు భావిస్తున్నారన్నారు.
పడవ బోల్తా: ఒకరు మృతి
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడి, ఒకరు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఆరుగురు పడవలో వేటకు వెళ్లారు. వేట ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అలల ఉధృతికి పడవ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న ఎర్రన్న గాయపడి మృతి చెందాడు.












Click it and Unblock the Notifications