మాన్సాస్ వివాదం : ఫోర్జరీ కేసు, జైలుకు వెళ్ళక తప్పదు; అశోక్ గజపతిరాజుపై సాయిరెడ్డి ధ్వజం
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఏపీ హైకోర్టు అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పునిస్తూ వైసీపీ ప్రభుత్వం నియమించిన సంచయిత నియామక ఉత్తర్వు జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అప్పటినుండి విజయ సాయి రెడ్డి అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేస్తున్నారు. మాన్సాస్ ట్రస్టులో 100 ఎకరాలు కాజేసిన దొంగ అశోక్ గజపతిరాజు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి అటు సోషల్ మీడియా లోనే కాకుండా ఇటు మీడియా ముఖంగా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అశోక్ గజపతి రాజు జైలుకు వెళ్లడం తప్పదు
నేడు విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి అశోక్ గజపతిరాజు పై గతంలో ఫోర్జరీ కేసు ఉందంటూ వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి రాజు జైలుకు వెళ్లడం తప్పదని ఆయన వెల్లడించారు. అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారని విమర్శించిన విజయసాయిరెడ్డి, మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. అశోక్ గజపతిరాజు లింగ వివక్ష చూపిస్తున్నారని విజయ సాయి రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని వదిలే ప్రసక్తే లేదు
సీఎం జగన్ మోహన్ రెడ్డి పురుషులతో పాటు మహిళలను కూడా సమానంగా చూస్తారని, గౌరవిస్తారని పేర్కొన్నారు. భూకబ్జాల వ్యవహారంలో టిడిపి నేతలు తాత్కాలికంగా స్టేలు తెచ్చుకోవచ్చు కానీ శాశ్వతంగా మాత్రం తప్పించుకోలేరు అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విజయసాయిరెడ్డి, అటు సోషల్ మీడియా వేదికగానూ నిప్పులు చెరిగారు. ఈ 40 ఏళ్ళ మీ హిందుత్వం ఎటు పోయింది అశోక్ అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి .
Recommended Video

అప్పుడు ఎక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం
మీరు చైర్మన్ గా ఉన్న గుడిలోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారు అంటూ నిలదీశారు. అంతేకాదు మాన్సాస్ లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయింది అంటూ ప్రశ్నించారు. వీరు మంత్రిగా వెలగబెట్టిన అప్పుడే మోతీ మహల్ కూల్చారు అప్పుడు ఎక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం అంటూ అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఆయనను టార్గెట్ చేస్తూ నిప్పులు చేరుగుతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications