Mantena: ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి, మంతెన అనూహ్య నిర్ణయం..!!
ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ఆయన్ను ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించింది. ప్రత్యేకంగా ఆశ్రమం నిర్వహణతో పాటుగా ఆరోగ్య పరమైన సూచనలు.. సలహాలు ఇవ్వటం ద్వారా మంతెన ప్రముఖ గుర్తింపు పొందారు. తాజాగా సీఎం చంద్రబాబు తో మంతెన సమావేశమయ్యారు. ఈ సమయంలో ప్రకృతి వైద్య సలహాదారుగా తన బాధ్యతల పైన చర్చించారు. అదే సమయంలో సలహాదారు హోదాలో తన నిర్ణయం ఏంటో వెల్లడించారు.
ప్రకృతి వైద్య రంగంలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అనుభవాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన్ను ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించింది. డాక్టర్ రాజు రెండే ళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన విధానా లపై ప్రభుత్వానికి డాక్టర్ రాజు సలహాలు, సూచనలు అందించనున్నారు. మంతెన ఇప్పటికే అమరావతి సమీపంలో మంతెన ఆరోగ్యాలయం పేరుతో ప్రకృతి చికిత్సాలయం, పరిశోధన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంతెన సత్యనారాయణ రాజు సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి డాక్టర్ మంతెన 35 సంవత్సరాల సేవలను ప్రశంసించారు. ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి సంజీవని ప్రాజెక్టు వంటి అనేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నంలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు లాంటి నిపుణుల సలహాలు, సూచనలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల, యోగా, నాచురోపతి విభాగం నుంచి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించాలని ఆయన డాక్టర్ రాజు కు సూచించారు.

జీత భత్యాలు తిరస్కరణ
దీనికి స్పందనగా మంతెన తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఏ హోదాలు, పోస్టులు తీసుకోకూడదనే నియమాన్ని పెట్టుకున్నానని వివరించారు. తాను వెనుక ఉండి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తానని, ప్రభుత్వ సహకారం ఉంటే తాను చేస్తున్న పనికి రెట్టింపు ఉత్సాహంతో, ఎక్కువ సమయాన్ని కేటాయించి సేవ చేస్తానని పేర్కొన్నారు. అయితే, హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్లదని, పదవిలో ఉండి చెబితే అమలుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో.. మంతెన తాను సలహాదారుగా ఉండాలంటే, క్యాబినెట్ హోదాతో వచ్చే ఏ సదుపాయాలనూ తాను తీసుకోనని స్పష్టం చేశారు. ఇందులో నెల జీతం, ప్రభుత్వ కారు, ఇతర ఖర్చులు, ఇంట్లో సహాయకుల జీతాలు, విమాన, రైలు టిక్కెట్లు, కార్యాలయ సదుపాయాలు వంటివి ఏవీ స్వీకరించనని స్పష్టం చేసారు. చివరకు మంతెన అభిప్రాయాలకు ముఖ్యమంత్రి అంగీకరించారు.












Click it and Unblock the Notifications