పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల్లో కోత - వీరికే నిధులు, ఏం జరుగుతోంది..!?
రైతులకు ఒకేసారి రెండు పథకాల నిధులను ఏపీ - కేంద్ర ప్రభుత్వం జమ చేసాయి. ఈ నెల 2న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి విడుదల చేసారు. అయితే, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ నిధులు అందుకున్న రైతులు చాలా మందికి పీఎం కిసాన్ నిధులు అందలేదు. అదే విధంగా అర్హత ఉన్నా.. అన్నదాత సుఖీభవ అందని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అయితే.. ఇప్పుడు ఒక పథకానికి అర్హత ఉన్న రైతులు మరో పథకానికి ఎలా అర్హత లేకుండా పోయిందనేది ఆందోళనగా మారుతోంది.

రైతులకు కోత
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ స్కీంలకు అర్హత పొందిన లబ్ధిదారుల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. అన్నదాతా సుఖీభవ పథకం లబ్ధిదారుల కంటే పిఎంకిసాన్ లబ్ధిదారులు ఆరు లక్షల వరకు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అదే సమయంలో పిఎం కిసాన్ అర్హత సాధించిన లబ్ధిదారులు 40.78 లక్షలు. పేమెంట్ సక్సెస్ అయింది 40.77 లక్షల మందికే అని తెలుస్తోంది. అర్హులైన లబ్ధిదారులు అందరికీ నిధులు జమ అయ్యాయని కేంద్ర అధికారులు చెబుతున్నారు. రెండు పథకాలను కలిపి ఒకే పథకంగా అమలు చేయడం వలన ఆరు లక్షల మంది రైతులు పిఎంకిసాన్ కింద ఏటా దక్కాల్సిన రూ.6 వేలు కోల్పోతున్నారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
రెండూ కలిపి
పీఎం కిసాన్ లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వమే ఎంపిక చేసింది.కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర సర్కార్ లబ్ధిదారులను గుర్తించి జాబితాలు పంపుతోంది. వడపోతల అనంతరం రాష్ట్రం పంపిన జాబితాల్లో లబ్ధిదారులకు కేంద్రం కోతలు పెడుతోంది. 2024-25లో పిఎంకిసాన్ తొలి కిస్తు 41.22 లక్షల మందికి పడింది. రెండు, మూడు విడతల్లో సైతం అంత మందికే పడ్డాయి. నిరుడు అన్నదాతా.. పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ సంవత్సరం అన్నదాతా సుఖీభవ- పిఎం కిసాన్ కలిపి నిధులు విడుదల చేసారు. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా మిగిలిన రూ 14 వేలు ఇవ్వాలని డిసైడ్ అయింది.. అమలు ప్రారంభించింది.
జమ కాని నిధులు
కాగా, ఆగస్టు 2న విడుదల చేసిన నిధుల మేరకు లబ్ధిదారులకు మొత్తం 7 వేలు పడాల్సి ఉండగా ఆరు లక్షల మందికి పిఎం కిసాన్ 2 వేలు పడలేదు. వారికి కేవలం అన్నదాతా.. 5 వేలే పడ్డాయి. కొన్నిచోట్ల అన్నదాతా పడితే పిఎం కిసాన్ పడలేదు, పిఎంకిసాన్ పడ్డవారికి అన్నదాతా.. జమ కాలేదన్న ఫిర్యాదులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. గత వైసిపి ప్రభుత్వం పిఎంకిసాన్‌తో రైతు భరోసాను కలపడం వలన సమస్య తలెత్తింది. రైతు భరోసా లబ్ధిదారుల కంటే పిఎంకిసాన్ లబ్ధిదారుల సంఖ్య పది పన్నెండు లక్షలు తక్కువగా ఉంది. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఒక్కటే జమ అయింది. పిఎంకిసాన్ పడలేదు. భరోసా లబ్ధిదారులు 52 లక్షలై తే పిఎంకిసాన్ లబ్ధిదారులు 40-40 లక్షలుగా కొనసాగింది. దీంతో, ఇప్పుడు రెండు పథకాల విషయంలో న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications