మల్కాజిగిరిపై సీమాంధ్ర, ముఖ్యనేతల కన్ను ఎందుకు?

ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. విభజన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో సీమాంధ్ర నాయకులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తద్వారా తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీరే కాకుండా తెలంగాణ ప్రాంత నాయకులు కూడా చాలామంది పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. చంద్రబాబు పోటీ చేయకుంటే తాను సిద్ధమని తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుండి పోటీ చేస్తానని గతంలో చెప్పారు.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఇప్పటికీ భారీ హోర్డింగ్‌లతో ప్రచారం సాగిస్తున్నారు.
కాగా, 2014 సాధారణ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేస్తే మల్కాజిగిరి నుంచి విజయం సాధించవచ్చునని రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వానికి వివరించారట. ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి చేరితో మల్కాజిగిరి నుంచి తాను గెలిస్తే కేంద్ర మంత్రిగా తెలంగాణలో టిడిపికి పెద్ద దిక్కుగా ఉంటానని ఆయన పార్టీ నాయకులకు చెబుతున్నారట.
మల్కాజిగిరిలో పార్లమెంటు నియోజకవర్గంలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటెన్మెంట్ నియోజకవర్గాలున్నాయి. సికింద్రాబాద్, కంటెన్మెంట్ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో సీమాంధ్రకు చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
మరోవైపు సీమాంధ్ర ఓటర్లు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చీలితే తెలంగాణ రాష్ట్ర సమితి లేదా కాంగ్రెసు అభ్యర్థుల గెలుపు ఖాయమంటున్నారు. జనరల్ నియోజకవర్గం అయినా గత ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు టికెట్ లభించింది. ఈ దఫా కూడా ఆయనే పోటీ చేయనున్నారు. చంద్రబాబు, షర్మిల, జెపి, డిఎల్ రవీంద్రా రెడ్డి, జయసుధ, సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి తదితరుల పేర్లు వివిధ పార్టీల నుండి చక్కర్లు కొడుతున్నాయి.
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పడిన మల్కాజిగిరి నియోజకవర్గంలో తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది అర్బన్ మిడిల్ క్లాస్ ప్రజలు. ఇక్కడ 70 శాతం మంది వరకు సీమాంధ్రులు ఉంటారని అంచనా. అందుకే ఈ నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత అంటారు.












Click it and Unblock the Notifications