'2019 వరకు జైలులో జగన్', కుంభాభిషేకంలో పాల్గొన్న వైసిపి చీఫ్
నెల్లూరు: వచ్చే ఎన్నికల కంటే ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని టిడిపి శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ జైలుకు వెళ్లడం తప్పదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అసాంతికి కారకుడు జగన్ అని ఆరోపించారు. గాలేరు - నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల పైన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. జగన్‌ది మేకపోతు గాంభీర్యమన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలన్న జగన్ వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ రాజీనామా చేయించి, తిరిగి గెలిపించుకోవాలని సవాల్ చేశారు. అశాంతితో అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ మళ్లీ సవాలు విసురుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్‌కు దమ్ముంటే వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతి సవాల్ విసిరారు. 2019 నాటికి జగన్ జైలులో ఉంటాడా లేదా అనేది జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకోవాలని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
విశాఖలో మహా కుంభాభిషేకంలో పాల్గొన్న జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు విశాఖలో శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. శారదా పీఠంలో మహా కుంభాభిషేకం ముగింపు వేడుకలు గురువారం జరిగాయి.


Click it and Unblock the Notifications