జగన్ తో బెంగళూరులో ఐపీఎస్ ల భేటీ ? మెమోల జారీ వెనుక షాకింగ్ రీజన్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారన్న కారణంతో 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టేసింది. దీనిపై వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం వీరికి రోజూ డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉండి హాజరు నమోదు చేసి వెళ్లాలంటూ మెమోలు ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు రోజుకో కారణం చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో పోలీసు అధికారిగా పనిచేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఐపీఎస్ అధికారులకు మెమోలు ఇవ్వాల్సి రావడంపై ఇవాళ మరో షాకింగ్ విషయం చెప్పారు. వైఎస్ జగన్ ను బెంగళూరులో వెళ్లి కలవడం వల్లే వీరికి మెమోలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అంతే కాకుండా వీరిపై డీజీపీ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎస్ లకు మోమోల జారీపై వస్తున్న విమర్శలపై వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.

గతంలో సీనియార్టీలో 15వ స్ధానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించినప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్ లో పెట్టిన సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్, సంజయ్ ల చరిత్ర వీరికి తెలియదా అని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండానే 170 మంది సీఐలు, డీఎస్పీలను వీఆర్ లో పెట్టారని వారికి గుర్తుచేశారు. తద్వారా వారు చేసిన దాన్నే తాము కొనసాగిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications