వైసీపీ ఆధ్వర్యంలో మూడుప్రాంతాల్లో మెగా జాబ్ మేళా.. వైసీపీ కార్యకర్తలకు ప్రత్యేకమన్న సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ మేళాలను నిర్వహించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఈ మేరకు 3 మెగా జాబ్ మేళాలను నిర్వహించడం కోసం వైసిపి ఏర్పాట్లు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమంగా ఈ మెగా జాబ్ మేళా లను పేర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి మెగా జాబ్ మేళా లకు సంబంధించిన తేదీలను ప్రకటించారు.

వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు .. తేదీలు ప్రకటించిన సాయిరెడ్డి
ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని విజయ సాయి రెడ్డి వెల్లడించారు. కనీసం 5000 మందికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23, 24 తేదీలలో ఆంధ్ర యూనివర్సిటీ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఆపై ఏప్రిల్ 30, మే 1 వ తేదీలలో నాగార్జున యూనివర్సిటీ లో జాబ్ మేళా జరగనున్నాయని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.

జాబ్ మేళాలు పూర్తిగా పార్టీ కార్యక్రమం అని పేర్కొన్న విజయసాయిరెడ్డి
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానుల కోసమే ఈ మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ఇక తిరుపతి జాబ్ మేళా కు రాయలసీమ వారికి, ఆంధ్ర యూనివర్సిటీ లో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా వారికి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు నాగార్జున యూనివర్సిటీ లో నిర్వహించనున్న జాబ్ మేళాలకు హాజరుకావాలని సూచించారు.

మూడు జాబ్ మేళాలలో 15 వేల నుండి 20 వేల మందికి ఉద్యోగాలు
మొత్తంగా ఈ మూడు జాబ్ మేళాలలో 15 వేల నుంచి 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించిన విజయసాయిరెడ్డి, జాబ్ మేళా కు హాజరైన అభ్యర్థులకు స్పాట్లోనే ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఎంపికైతే నియామక పత్రాలను అందజేయనున్నట్టు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయసాయి రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications