తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే! చిరంజీవి అన్నయ్యా..!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వేదాళం రీమేక్ భోళాశంకర్ విడుదలైంది. షరా మాములుగానే భారీ డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా ప్రకటించినప్పుడే చిరు అభిమానులు మెహర్ తో సినిమా వద్దంటూ ఒత్తిడి చేశారు. కానీ మెహర్ పై నమ్మకంతో ముందుకెళ్లిన మెగాస్టార్ బోల్తాపడ్డారు.
మెహర్ రమేష్ పేరు చెబితే షాడో, శక్తి లాంటి డిజాస్టర్లు గుర్తుకొచ్చి సినీ ప్రేమికులు దడుచుకుంటారు. అలాంటిది చిరు అన్నయ్య మెహర్ కు ఎందుకు ఆఫర్ ఇచ్చాడా? అని అభిమానులు తలలు బద్దలుకొట్టుకుంటున్నారు. రెండో ఇన్నింగ్స్ లో జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న చిరంజీవి 10 సంవత్సరాల విరామం తర్వాత మెగా ఫోన్ పట్టే అవకాశాన్ని రమేష్ కు కల్పించారు.

వాస్తవానికి చిరంజీవికి అత్యంత విశ్వాసపాత్రుడు మెహర్ రమేష్. చిరుకు సంబంధించిన వ్యవహారాలన్నీ తనే చక్కబెడుతుంటాడు. చాలాకాలం నుంచి చిరుతోనే ఉన్నాడు. అంతేకాదు.. అన్నయ్యకు బంధువు కూడా. వరుసకు చిరంజీవి మెహర్ రమేష్ కు అన్నయ్య అవుతాడు. ఓ అన్నయ్యగా తమ్ముడి కెరీర్ ను చక్కదిద్దే బాధ్యత చిరు తీసుకున్నారు. రిస్క్ తక్కువగా ఉండే రీమేక్ వేదాళం సినిమాను అప్పగించాడు. మినిమం గ్యారంటీ ఉంటుందనే అభిప్రాయంలో చిరు ఉండేవాడు.
సినిమాలు షూటింగ్ జరుపుకునే సమయంలో దర్శకత్వంలో, కథలో చిరంజీవి వేలు పెడతాడనే టాక్ ఉంది. అయితే చిత్రంగా భోళాశంకర్ కు సంబంధించి మెహర్ కు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చేశారు. ఈ కథపై మెహర్ రెండు సంవత్సరాలు పనిచేశారు. టీమ్ ను పెట్టుకొని మరీ మార్పులు చేశారు. కథ చెప్పినప్పుడు కూడా చాలా బాగుందనిపించి బాధ్యత మొత్తం రమేష్ కే వదిలేశాడు.
ఒక్క సీన్ లో కూడా భావోద్వేగాలు పండలేదు. సీరియల్ తీసినట్లు తీశారు. అర్థం పర్థం లేని కామెడీ, అనవసరమైన పాత్రలతో విసిగించాడు. వాస్తవానికి మెహర్ రమేష్ తప్పేం లేదు.. ఆయన్నుంచి ఇటువంటి ప్రాజెక్టు కాకుండా బ్లాక్ బస్టర్ ప్రాజెక్టులు రావుకదా. చిరంజీవే ఓడిపోయారు. తనవాళ్లకు ఒక అవకాశం ఇద్దామనుకున్న ఆయన ఆలోచన ఓడించింది. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని అన్నట్లుగా తాజాగా చిరంజీవి కూడా తత్వం బోధపడింది.












Click it and Unblock the Notifications