జగన్ తో భేటీ - సుచరిత గుడ్ బై..!!
మాజీ హోం మంత్రి సుచరిత కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా సుచరిత వైసీపీ వీడుతున్నారనే ప్రచారం ఉంది. ఎన్నికల సమయంలోనే ఈ ప్రచారం మొదలైంది. తాజా ఎన్నికల్లో సుచరిత తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు కాదని, తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జగన్ గుంటూరు వచ్చిన ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు జగన్ తో సమావేశమైన సుచరిత తన నిర్ణయం వెల్లడించారు. రాజకీయాలకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నారు.
జగన్ తో భేటీ
గుంటూరు జిల్లాలో వైసీపీ కీలక నేత సుచరిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. తాజా ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసిన మాజీ హోం మంత్రి సుచరిత మాజీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తన అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో కొనసాగలేనని వెల్లడించారు. కొంత కాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు. కానీ, తన వ్యక్తిగత సమస్యలను సుచరిత వివరించారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. తాడికొండలో తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. దీంతో, రాజకీయాల నుంచి సుచరిత వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.

జగన్ సన్నిహిత నేతగా
మేకతోటి సుచరిత 2009 లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో సుచరితకు జగన్ హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయం లోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ ను కలిసిన తరువాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు. ఇక, 2024 ఎన్నికల వేళ సుచరిత ప్రత్తిపాడు కాదని... తాడికొండ నుంచి పోటీ చేసారు. సుచరిత అభ్యర్ధన మేరకే సీటు కేటాయించినా.. అక్కడ ఓడిపోయారు.
ఫలితాల తరువాత
ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యక్రమాలకు సుచరిత దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా రెండు సార్లు గుంటూరుకు వచ్చారు. సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పు పైన ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రత్తిపాడు, తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జనసేనలోని ముఖ్య నేతలు సైతం మాట్లాడినట్లు తెలిసింది. అయితే, తాను రాజకీయాల్లోనే ఉండాలని అనుకోవటం లేదని తాజాగా సుచరిత సమాచారం ఇచ్చారు. ఇక, ఇప్పుడు జగన్ తో భేటీలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications