విజయవాడలో దారుణం- మానసిక వికలాంగురాలిపై ఆస్పత్రిలోనే గ్యాంగ్ రేప్-మూడ్రోజులుగా
ఏపీలో జనం సిగ్గుతో తలదించుకునే ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఏకంగా ప్రభుత్వాసుపత్రిలోనే ఓ మానసిక వికలాంగురాలిని తీసుకొచ్చి ముగ్గురు మూడు రోజులుగా గ్యాంగ్ రేప్ చేస్తున్న ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. చివరికి సదరు బాధితురాలిని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాక కానీ వారు స్పందించలేదు. ఈ ఘటనపై విపక్షాలు ఆస్పత్రితో పాటు పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.

విజయవాడలో గ్యాంగ్ రేప్
విజయవాడ సమీపంలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతానగరం వద్ద ఓ పెళ్లి కావాల్సిన యువతిపై దారుణంగా అఘాయిత్యం జరిగి ఏడాది కూడా కాకముందే ఈసారి నగరంలోనే అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై జరిగిన అఘాయిత్యం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూడు రోజుల క్రితం నున్నలో అదృశ్యమైన బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో దారుణ పరిస్ధితుల్లో కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.

మతిస్ధిమితం లేని యువతిపై
విజయవాడ శివార్లలోని నున్న పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ 20 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆమెకు మతిస్ధిమితం కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. వారు గాలింపు చేపట్టారు. అయితే మూడు రోజుల తర్వాత ప్రభుత్వాసుపత్రిలో ఆమె ఉన్నట్లు తెలిసి కుటుంబ సభ్యులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు గుర్తించారు. ఇందులో ముగ్గురు యువకుల పాత్ర ఉన్నట్లు తేల్చారు.

మాయమాటలు చెప్పి తీసుకెళ్లి
మతి స్థిమితం లేని 20 ఏళ్ల యువతిని ఆమెకు సన్నిహితంగా ఉండే ఓ యువకుడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అతడు అక్కడే కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న మానసిక వికలాంగురాలైన ఈ యువతిని నమ్మించి తీసుకెళ్లిన సదరు ఉద్యోగి.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
యువతి నోట్లో గుడ్డలు కుక్కి మరీ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇలా మూడు రోజులుగా ఆమెపై అఘాయిత్యం కొనసాగించారు. యువతిని వివస్త్రను చేసి అక్కడే వదిలేశారు. ఈ స్ధితిలో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది. ఆమె పుస్తకంలో ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పీఎస్ ను ముట్టడించిన విపక్షాలు
మానసిక వికలాంగురాలైన యువతిపై ఏకంగా ప్రభుత్వాసుపత్రిలోనే మూడు రోజులుగా అత్యాచారం జరుగుతుంటే సిబ్బంది, పోలీసులు ఏం చేస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ నున్న పీఎస్ వద్ద విపక్ష టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు ఆందోళనకు దిగాయి.
మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, జనసేన నేత పోతిన మహేష్, సీపీఎం నేత బాబూరావు పీఎస్ వద్ద నిరసన చేపట్టారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున గ్యాంగ్ రేప్ జరిగినా ప్రభుత్వానికి సమాచారం లేకపోవడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఇప్పటికైనా పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications