తుళ్లూరులో మెట్రో కారిడార్: విశాఖపై మెట్రో శ్రీధరన్
విజయవాడ: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికను ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని ప్రభుత్వ మెట్రో సలహాదారు శ్రీధరన్ బుధవారం తెలిపారు. విజయవాడ, విశాఖపట్నంల్లో ఆయన పర్యటించారు. ఆయన బుధవారం రాత్రి ఏడు గంటలకు విజయవాడ చేరుకున్నారు.
మార్చి నాటికల్లా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామన్నారు. తుళ్లూరు ప్రాంతానికి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా మెట్రో కారిడార్ నిర్మాణంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నేపథ్యంలో తుళ్లూరుకు చాలా సులువుగా మెట్రో రైలు కారిడార్ వేయవచ్చని శ్రీధరన్ చెప్పారు.

విజయవాడ మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న సర్వే పనులు, డిజైన్స్‌కు సంబంధించి సమీక్షించటానికే తాను వచ్చానన్నారు. గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్నారు. అతిథి గృహంలో ఆయన అధికారులతో సమీక్షించారు. మెట్రో డ్రాఫ్ట్ డిజైన్స్‌ను, సంబంధిత మ్యాపులను పరిశీలించారు. స్టేషన్ల డిజైన్లనూ ఆయన పరిశీలించారు.
మరోవైపు, విశాఖపట్నంలో మెట్రో రైలుకు సంబంధించిన సర్వేను ఫిబ్రవరి 15 నాటికి పూర్తిచేయాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఎలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని కాబట్టి వీలైనంత త్వరగా సర్వేను పూర్తిచేయాలన్నారు.












Click it and Unblock the Notifications