దేశంలో భూప్రకంపనలు: ఆంధ్ర తీరంలోనూ
న్యూఢిల్లీ: దేశంలోని ఉత్తరాదిని ఢిల్లీ మొదలుకొని తూర్పు తీరం వరకు భారత భూభాగం కంపించింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. బుధవారం రాత్రి 9.51 గంటల సమయంలో నిమిషం వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. కొన్నిచోట్ల గరిష్ఠంగా 12 క్షణాలు ప్రకంపనలు కనిపించాయి. దీని ప్రభావంతో ఇళ్లలోని కుర్చీలు, టేబుళ్లు, మంచాలు కదిలాయి.
రాత్రి భోజనాలు చేస్తూ, టీవీలు చూస్తూ, నిద్రకు ఉపక్రమిస్తున్న వారంతా ఒక్కసారిగా బెంబేలెత్తారు. భయభ్రాంతులై ఉన్నపళంగా ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు. శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని అనేక గ్రామాల్లో భూకంప ప్రభావం కనిపించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. తిరుపతిలో మూడు క్షణాలపాటు, తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆరేడు క్షణాలపాటు భూమి కంపించింది.

విశాఖపట్నానికి 539 కిలోమీటర్ల దూరంలో ఉత్తర బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో 39 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రతను 5.8గా నిర్ధారించారు. దీనివల్ల సునామీ ప్రమాదమేమీ లేదని నిర్ధారించారు. భూకంప ప్రభావం వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు బీహార్, ఒడిసా, తమిళనాడులోనూ భూమి కంపించింది. చెన్నైలోని నుంగంబాక్కం, కోడంబాక్కం, అడయార్, టీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు అపార్ట్‌మెంట్లలో నుంచి భయంతో బయటికి వచ్చేశారు.












Click it and Unblock the Notifications