అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త!
తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా బాలికలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు వల విసురుతున్నారు. ముఖ్యంగా 'ఫ్రీ ఫైర్' గేమ్‌ను ఉపయోగించి అపరిచితులు బాలికలతో స్నేహం చేసి వారిని ఉచ్చులో పడేస్తున్న ఘటనలు తాజాగా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. గేమ్‌లో ఆటగాళ్లు పరస్పరం మాట్లాడుకునే సౌకర్యాన్ని ఉపయోగించి మాయమాటలతో బాలికలను ఆకర్షిస్తున్నారు.
ఫ్రీ ఫైర్ గేమ్‌లో ట్రాప్.. బాలికలు అదృశ్యం
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాలికలు ఫ్రీ ఫైర్ గేమ్‌లో అపరిచితుల మాటలకు ఆకర్షితులై తల్లి తిట్టగానే కోల్‌కతా వెళ్లేందుకు రైలెక్కారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవటం వలన వారిని సురక్షితంగా కాపాడగలిగారు. మరో కేసులో ఒక బాలికను గుర్తుతెలియని మహిళ తన వెంట తీసుకెళ్లి వారం తర్వాత తిరిగి ఇంటికి పంపించింది. బాలిక పొంతన లేని సమాధానాలు చెప్పడం తల్లిదండ్రులను కలవరపెట్టింది.

బాలికలను టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాలు
ఈ రెండు కేసుల్లోనూ బాలికలు ఫ్రీ ఫైర్ ఆట ఆడే అలవాటు ఉందని పోలీసులు గుర్తించారు. అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాలు ఫ్రీ ఫైర్ గేమ్‌ను వేదికగా చేసుకుని బాలికలను లక్ష్యం చేసుకుంటున్నారు. గేమ్‌లో సహాయం చేస్తానని, ఆయుధాలు కొనుగోలు చేయడానికి డబ్బు ఇస్తానని నమ్మించి వారి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత స్నేహం పేరిట ఫోన్ నంబర్లు తీసుకుని వారిని ట్రాప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో జరిగిందిదే
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 'రిచ్ కిడ్స్ ట్రాప్' కేసు ఇలాంటి నేరాలకు ఉదాహరణగా చెప్పొచ్చు. స్నేహం పేరిట దగ్గరై బాలికల ఫొటోలు, వివరాలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరువు పోతుందన్న భయంతో చాలా మంది ఫిర్యాదు చేయడం లేదు. ఈ ఘటనలపై పోలీసులు అలెర్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు.
పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారో మానిటర్ చెయ్యాలన్న పోలీసులు
తల్లిదండ్రులు పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారో పర్యవేక్షించాలని, అనుమానాస్పద మెసేజ్ లు వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. పేరెంటల్ కంట్రోల్స్ ఉపయోగించి, రాత్రి వేళల్లో ఫోన్ వాడకుండా చూడాలని హెచ్చరించారు. బాలికల సురక్షకు తల్లిదండ్రులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని పోలీసులు చెప్తున్నారు.













Click it and Unblock the Notifications