లోకేష్ కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్; ఆరోపణలు కాదు ఆధారాలు చూపించండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న అమ్మఒడి పథకంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారని, లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఏపీ ప్రజలు జగన్ శాశ్వత ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్న ఆయన లోకేష్ బాబు, ఆయన బాబు చంద్రబాబు ప్రభుత్వం పై బురదజల్లడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు.

అమ్మఒడి పథకానికి మార్పులు చేశారనేది ఎల్లో మీడియా దుష్ప్రచారం
అమ్మఒడి పథకానికి మార్పులు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని, నిజంగా ఆ సర్క్యూలర్ ఉంటే బయట పెట్టాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తల్లి రొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరని, కానీ ఎల్లో మీడియా చంద్రబాబు కోసం అమ్మ ఒడి పథకం పై విషం చిమ్ముతోంది అంటూ మండిపడ్డారు.

కరోనా సమయంలో కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు
అమ్మ ఒడి పథకం కింద రెండు సార్లు పిల్లల తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికీ 15 వేల చొప్పున, ఇప్పటి వరకు దాదాపు 13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అమ్మ ఒడి పథకాన్ని యావత్ భారతదేశం ప్రశంసిస్తోంది అని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ చదువుకు పేదరికం అడ్డం కాకూడదు అన్న ఉద్దేశంతోనే జగన్ ఈ పథకాన్ని తీసుకు వచ్చారని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న సమయంలో కూడా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు.

అమ్మ ఒడి అర్హతా నియమాలను సవరిస్తే ఆంక్షలు పెట్టినట్టా?
గత ఏడాది ఉన్న అర్హత నియమాలను సవరించి, గతం కంటే ఈ సారి ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అమ్మ ఒడి పై ఆంక్షలు విధించారని టిడిపి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శానిటేషన్ వర్కర్లకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇక అన్ని వర్గాలకు చెందిన 81 శాతం మహిళలకు ఈ పథకాన్ని అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి గ్రామ సచివాలయాలలో లబ్దిదారుల లిస్టు ఉంటుందని, అనుమానం ఉంటే పరిశీలించుకోవాలి అంటూ పేర్కొన్నారు.

టీడీపీ అసత్యాలను వండి వారుస్తుంది
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జగన్ అన్న ఒక్క బటన్ నొక్కడం ద్వారా పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నారని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ అసత్యాలను టిడిపి వండి వారుస్తున్నా కూడా ప్రజలకు వైసీపీ పై విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం వద్దనుకున్న వారికి లాప్ ట్యాప్ లు కూడా త్వరలో ఇస్తామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివే వారికి మరింత సహాయం చేస్తామని పేర్కొన్నారు.

అమ్మఒడిపై ఆంక్షల ఆధారాలను చూపించాలని లోకేష్ కు సవాల్
అమ్మ ఒడి పై ఆంక్షలు పెడుతున్నాం అంటూ విరుచుకుపడుతున్న లోకేష్, చంద్రబాబు అమ్మ ఒడి పై ఉన్న ఆంక్షల ఆధారాలను చూపించాలి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు అంటే వంచనకు చిహ్నమని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే అంటూ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు టిడిపి కుట్రలు చేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అనవసరపు ఆరోపణలు కాకుండా వాస్తవాలను మాట్లాడాలని టిడిపి నేతలకు హితవు పలికారు.












Click it and Unblock the Notifications