టీడీపీ హయాంలో చంద్రబాబు అప్పులపై పురంధేశ్వరి ప్రశ్నించారా? మంత్రి అమర్‌నాథ్ కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే ఎన్నికల వాతావరణం తలపిస్తున్నాయి. ఒక పక్కన పొత్తుల వ్యూహాలు ఇప్పటినుంచే ఏపీలో ప్రాధాన్యతను సంతరించుకుంటే మరొక పక్క ఒకరిపై ఒకరు మాటలు తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పురందేశ్వరికి అవగాహన లేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంటుందని, ప్రజలకు ఎంత అవసరమో అంతే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అది రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

పురందేశ్వరి మరిది చంద్రబాబు హయాంలోనూ అప్పులు చేశారని, మరి ఆనాడు చంద్రబాబును పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాము జవాబుదారీగా ఉంటామని పేర్కొన్న మంత్రి గుడివాడ టిడిపి హయాంలో చంద్రబాబు చేసిన అప్పుల గురించి పురందేశ్వరికి తెలియదా అంటూ ప్రశ్నించారు. బిజెపి అప్పుడు ఇలాగే మాట్లాడితే బాగుండేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలు అంటించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన నిధుల దుర్వినియోగం గురించి పురందేశ్వరికి తెలియదా? దీనిపై ఆమె అప్పుడు మాట్లాడారా? అంటూ గుడివాడ అమర్నాథ్ పురందేశ్వరిని టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే పురందేశ్వరి నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వం 7.14 లక్షల కోట్ల మీద అప్పు చేసిందని ఇక అందులో నాలుగు లక్షల కోట్లకు పైగా అనధికార అప్పులే ఉన్నాయని ఆరోపించారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు మరే ఇతర రాష్ట్రాలలో లేవని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో పొత్తుల పైన కూడా పార్టీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని , తను త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతానని పురందేశ్వరి తెలిపారు.












Click it and Unblock the Notifications