లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నుంచి ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో పార్లమెంటు వేదికగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని తెలుగుదేశం ప్రయత్నించింది.
ఈ క్రమంలో నారా లోకేష్ ఢిల్లీ కేంద్రంగా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ, అక్కడ నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లోకేష్ చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఢిల్లీలోని కేంద్ర పెద్దల చుట్టూ తిరుగుతున్నారని వైసిపి లోకేష్ ను టార్గెట్ చేస్తుంది. త్వరలో లోకేష్ అరెస్ట్ కూడా జరుగుతుందని, అందుకే ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారని వైసీపీ నేతలు లోకేష్ ను సైతం టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా చంద్రబాబు అరెస్టు తరువాత తెలుగుదేశం పార్టీ పైన, లోకేష్, బాలకృష్ణ ల పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్న వైసిపి మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. హలో లోకేష్ గారు తమరి లొకేషన్ ఎక్కడ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
లోకేష్ ఎక్కడున్నాడు అన్న దానిపైన ఆసక్తి చూపించిన మంత్రి అంబటి రాంబాబు లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మరోవైపు లోకేష్ ఢిల్లీ కేంద్రంగా టిడిపి ఎంపీలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఈ మేరకు లోకేష్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు గారిని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయించిన సైకో జగన్ తీరుపై దేశమంతా చర్చకు వచ్చేలా చేసిన టిడిపి ఎంపీలను తాను అభినందించాను అని పేర్కొన్నారు.
ఆయన చంద్రబాబు అక్రమ అరెస్టుని పార్లమెంటులో చర్చకి తెచ్చి, దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు గట్టి పోరాటం చేశారన్నారు.వైసిపి ఎంపీల హేళనలు, మాటల దాడులని తట్టుకుని సమర్థవంతంగా తెలుగుదేశం వాణిని ఎంపీలు పార్లమెంటులో వినిపించారన్నారు . భవిష్యత్ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications