పోలవరంపై అంబటి సంచలనం - ప్రాజెక్టు పూర్తికి గడువు లేదు : చంద్రబాబు వర్సెస్ వైసీపీ..!!
ఏపీ జీవనాడి పోలవరం పైన రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు లేదని.. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తప్పు బట్టింది. కేంద్ర ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసమే తాను కడతానంటూ తీసుకున్నారని ఆరోపణలు చేసింది.

పోలవరం పూర్తయ్యేదెన్నడు
2019 ఎన్నికల కంటే ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అప్పట్లో టీడీపీ మంత్రులు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ, ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇక, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలవరం పూర్తి చేయటానికి డెడ్ లైన్లు ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సవరించిన అంచనాల మేరకు నిధులు కేటాయించాలని సీఎం జగన్ పలుమార్లు ప్రధానితో సహా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. కానీ, ఇప్పటికీ సవరించిన అంచనాలకు ఆమోదం లభించలేదు. దీంతో..అసలు పోలవరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

డయాఫ్రం వాల్ పైన సందిగ్దత
ఈ సమయంలో గోదావరి డెల్టాకు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీటిని విడుదల చేసిన మంత్రి అంబటి రాంబాబు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమమంటూ వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనం గా మారింది. పోలవరం ప్రాజెక్టు విషయంపైనా మాట్లాడిన ఆయన.. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులపై మేధావులు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. డయా ఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలి. చంద్రబాబు, దేవినేని ఉమను చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో చర్చ జరగాలి. కాఫర్ డ్యామ్ పూర్తికాకుండా డయా ఫ్రం వాల్ కడతారా అని ప్రశ్నించారు. డయా ఫ్రం వాల్ కొనసాగించాలా లేక కొత్తది నిర్మించాలా అనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

ప్రాజెక్టు పూర్తికి గడువు లేదంటూ
దశలవారీగానే ఏ ప్రాజెక్టు అయినా పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. మొదటి దశ పూర్తికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలోనూ పలు మార్లు చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంబటి చెప్పుకొచ్చారు. అయితే, మహానాడు వేదికగా ప్రభుత్వం పైన పోలవరం విషయంలో చంద్రబాబు కౌంటర్ ఎటాక్ చేసారు. ఇప్పుడు అంబటి పోలవరం ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వటంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా వివాదానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications