టైమ్ అయ్యింది జోలె పట్టండి చంద్రబాబు : మంత్రి అనీల్ ఘాటు విమర్శలు
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనీల్ కుమార్ విరుచుకుపడ్డారు .ఈరోజు సభలో పార్టీ మారడం మరియు పొత్తులపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై అనీల్ కుమార్ ఫైర్ అయ్యారు. పొత్తు లేకపోతే ముద్ద దిగని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీయే అని ఆయన పేర్కొన్నారు . పొత్తు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేరంటూ టీడీపీని విమర్శించారు. పొత్తు లేకుండా పోటీ చేసే సత్తా టీడీపీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

పొత్తు లేకుండా బాబుకు ముద్ద దిగదు .. వైసీపీ సింగిల్ గానే పోటీ
చంద్రబాబు పొత్తుల కోసం చెయ్యి చాచిన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ,సీపీఐ, సీపీఎం, జనసేన ఇలా అన్ని పార్టీలు అయిపోయాయంటూ ఎద్దేవా చేశారు. కానీ సీఎం జగన్ సింహం లాంటివాడని ఆయన నాయకత్వంలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని 2024లో కూడా తాము ఒంటరి గానే పోటీ కి దిగుతామని వైసీపీ పొత్తుల కోసం చూసే పార్టీ కాదని స్పష్టం చేశారు. అలాగే 2024లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం టీడీపీ కి ఉందా అంటూ సవాల్ విసిరారు.

డొనాల్డ్ ట్రంప్ తో కూడా పొత్తు పెట్టుకోగల సమర్ధుడు చంద్రబాబు
ఇక చంద్రబాబు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా పొత్తు పెట్టుకోగలరని ఎద్దేవా చేశారు . పొద్దున లేస్తే ఏ పార్టీ చంక ఎక్కుదామా, ఏ పార్టీ కాళ్లు మొక్కుదామా అని బాబు ఆలోచిస్తుంటారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఇంకా సిగ్గు లేకుండా అలాంటి టీడీపీ నేతలు పొత్తులు గురించి మాట్లాడుతున్నారు అంటూ సభలో ఫైర్ అయ్యారు మంత్రి అనీల్ . ఇక మీరు జోలె పట్టుకునే టైమ్ అయింది బయలుదేరండి అంటూ ఇటీవల రాజధాని అమరావతి కోసం జోలెపట్టిన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జోలె పట్టే టైమ్ అయ్యిందని బాబుకు చురకలు
మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది అని కొత్తగా జోలె పట్టుకు తిరుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు . గతంలో సెక్రటేరియట్ లో ఒక హుండీ పెట్టారని పేర్కొన్న మంత్రి ఆ హుండీ డబ్బులు ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలీదని పేర్కొన్నారు . ఇప్పుడు జోలె పడుతున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు అంటూ అనిల్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications