ఎన్నికలు- బీజేపీతో పొత్తుపై తేల్చేసిన మంత్రి బొత్స
అమరావతి: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఎన్నికలు చేరువ అవుతున్న సమయంలో- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంపై వరాల సునామీని కురిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తోంది.
అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవలే హస్తినలో పర్యటించి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిల గురించి వారి వద్ద ప్రస్తావించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనేది తెలిసిన విషయమే.

దేశ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తోన్న వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అధిష్ఠానం సానుకూలంగా ఉందని, అందుకే వైఎస్ జగన్ అడిగిన డిమాండ్ల పట్లను అప్పటికప్పుడు నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇస్తోందనే వాదనలు లేకపోలేదు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో వైసీపీ చేరుతుందనే ప్రచారం సైతం ఉంది.
వీటన్నింటిపైనా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్ నేత, విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని కూడా స్పష్టం చేశారాయన. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు ఉంటాయనీ వివరించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అజెండాగా అభివర్ణించారు మంత్రి బొత్స. వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీలతో తమకు పొత్తు అవసరం లేదని పునరుద్ఘాటించారు. 2019 నాటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్నింటినీ దాదాపుగా పూర్తి చేశామని, ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకున్నామని అన్నారు. గత ఎన్నికల కంటే 2024లో అధిక సీట్లనే గెలిచుకుంటామని బొత్స పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications