లబ్ధిదారులకు పెన్షన్ ఎవరు ఇస్తారు - ఏం జరుగుతోంది..!?
ఏపీలో వాలంటీర్ల పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుంది. చంద్రబాబు మద్దతు దారులు చేసిన ఫిర్యాదు కారణంగానే వాలంటీర్ సేవలు లబ్ది దారులకు దూరమయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లకు ప్రమేయం లేకుండా మరో విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ సూచించింది. దీంతో, ఇప్పుడు లబ్దిదారులకు పెన్షన్లు ఎవరు ఇస్తారు.. ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
పెన్షన్లు ఇచ్చేదెవరు
ఏపీలో ప్రతీ నెలా 1వ తేదీన వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈసీ తాజా నిర్ణయంతో వాలంటీర్ల సేవలకు బ్రేకులు పడ్డాయి. కోడ్ అమలయ్యే వరకూ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అయ్యే అవకాశం లేదు. దీంతో, ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి ప్రత్యామ్నాయ విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక, ఇదే అంశం పైన సీనియర్ మంత్రి బొత్సా స్పందించారు. వలంటీర్లపై చంద్రబాబు కుట్రచేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబు టీం చేసిన పని
చంద్రబాబు అనుచరులు వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారననారు. ఇప్పుడు లబ్ధిదారులకు పెన్షన్ ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికి ఇప్పుడు వారికి బ్యాంక్ ఖాతాలు తెరిచి పెన్షన్ వేయాలంటే వీలు అవుతుందా అని వ్యాఖ్యానించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారని... ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే డీఎస్పీని ప్రకటించామని చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతామని బొత్సా స్పష్టం చేసారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించిందని చెప్పారు.

బీసీలను విస్మరించారు
బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చిందని విశ్లేషించారు. పవన్‌కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదన్నారు. బీజేపీ కూడా అదే పంధాలో వెళ్లిందని విమర్శించారు. ఆయా పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రజలపై చిన్నచూపు ఉంది కాబట్టే ఎక్కడో ఉన్న వారిని ఇక్కడ అభ్యర్థులుగా పెడుతున్నారని విమర్శించారు. ప్రశాంత ఉత్తరాంధ్ర వాతావరణాన్ని పాడు చేయడానికి లాబీయిస్టులను తీసుకువచ్చి అభ్యుర్థులుగా పెడుతున్నారని బొత్సా వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలని బొత్సా డిమాండ్ చేసారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని బొత్సా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications