జాతికి అంకితమంటూ డ్రామాలు, గేట్లు విరగగొట్టి ఇసుక దోపిడీ..
ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు ఘన స్వాగతం పలికారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన 'ప్రజా వేదిక' సభలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్సీపీ పాలనపై నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం సంపద సృష్టి, పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పీ4 (P4) విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి, ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వం సంక్షేమాన్ని కేవలం ఓట్ల కోసమే వాడుకుంటే, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ. 1,000 కోట్లు ఖర్చు చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకుందని తెలిపారు.

విద్యుత్ భారాలు - గత ప్రభుత్వ వైఫల్యాలు..
గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మంత్రి గొట్టిపాటి ధ్వజమెత్తారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ఏకంగా 9 సార్లు విద్యుత్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థపై రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లోనే 13 పైసలు 'ట్రూ డౌన్' చేసి వినియోగదారులకు ఊరటనిచ్చామని ఆయన గుర్తు చేశారు. జగన్ కు ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం..
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసగించిందని గొట్టిపాటి విమర్శించారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే జాతికి అంకితం చేస్తున్నామంటూ జగన్ డ్రామాలడారని ఎద్దేవా చేశారు. గుండ్లకమ్మ గేట్లు విరగగొట్టి ఇసుక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సకాలంలో సాగునీరు అందించి పంటలను కాపాడామని, తాజాగా వెలిగొండలో 20 లక్షల చేప పిల్లలను వదిలి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించామని పేర్కొన్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత పొందిన పవిత్రమైన తిరుమల లడ్డూను కూడా జగన్ రెడ్డి హయాంలో కల్తీ చేశారని దుయ్యబట్టారు. ఇక సంక్షేమ పెన్షన్ల విషయంలో జగన్ ఐదేళ్ల కాలంలో కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి ఆపసోపాలు పడితే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క సంతకంతో పెన్షన్ పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని మంత్రి ప్రశంసించారు.












Click it and Unblock the Notifications