తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్!! (వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి లను మారుస్తూ తీసుకుంటున్న నిర్ణయం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా చేస్తుంది . ఇక తాజాగా ఆ ఖాతాలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పడ్డారు.
Recommended Video

ఈ క్రమంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అనకాపల్లిలో వైసిపి కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్‌నాథ్ ఎంతో బాధతో వెళుతున్నా.. కానీ మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

అయితే తనకు టిక్కెట్ దక్కలేదని, గుడివాడ అమర్నాథ్ పని అయిపోయిందని చాలా పత్రికలు వార్తలు రాస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన తాను చిన్ననాటి నుంచే కష్టాలు చూసినవాడిని అని ఇలాంటి వార్తలకు తాను కుంగిపోనని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే ఒక పెద్ద పదవి ఉందని అదే వైసిపి కార్యకర్త పోస్ట్ అంటూ పేర్కొన్న ఆయన తనకు అంతకుమించి ఇంకేమీ అవసరం లేదన్నారు.
మీతో కార్యకర్తగా జెండా మోయటానికి సిద్ధంగా ఉన్నానని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డామని, అధికారం వచ్చాక కొంతమందికే పదవులు వచ్చాయని కొందరు ప్రచారం చేస్తున్నారని అలా ప్రచారం చేసే వాళ్ళు పార్టీలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది అంటూ వ్యాఖ్యలు చేశారు.
తన రాజకీయ జీవితం సంతృప్తిగా ఉందని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్ గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారని, రాజకీయాల్లో క్రింది స్థాయి నుంచి కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని అది చాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి అయిన భరత్ కుమార్ కు సహకరించాలని కార్యకర్తలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు.
అధికారమే లక్ష్యంగా అధినేత సీఎం జగన్ చేస్తున్న మార్పులలో భాగంగా వైసిపి ఇన్చార్జిల నియామకం జరుగుతుందని దీనిని అందరూ అంగీకరించాలని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అత్యున్నత శాఖలతో కూడిన మంత్రి పదవిని చేపట్టిన తాను కొంతమందికి ఉపకారం చేయలేకపోయానని, అయినప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
తాను ఇతర జిల్లాలకు చెందిన వాడిని కాదని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాడినని, మీ వాడినని గుడివాడ అమర్నాథ్ భావోద్వేగంగా మాట్లాడారు దీనితో గుడివాడ అమర్నాథ్ అనుచరులు. కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications