శ్రీశైలం ఆలయం మార్కాపురంలో విలీనం?: మంత్రి క్లారిటీ
ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు శరవేగంగా కొనసాగుతోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న జిల్లా పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా లేదని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భావిస్తోన్న కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల సరిహద్దులు, పేర్లు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ ఉపసంఘం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో- కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం ఆలయాన్ని విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ ఆలయం నంద్యాల జిల్లాలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో కర్నూలు జిల్లాలో కొనసాగింది శ్రీశైలం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చోెటు చేసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఇది నంద్యాలలో చేరింది.

ఇప్పుడు మళ్లీ దీన్ని మార్కాపురంలో చేర్చుతారనే ప్రజారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని వివాదాల్లోకి లాగడం మంచిదికాదని అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదనలేదని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ అంశంపై రెండు జిల్లాల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications