నియోజకవర్గ మార్పులపై జోగి రమేష్ కామెంట్స్
Jogi Ramesh: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల నియామక ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పుడు తాజాగా రెండో జాబితా సిద్ధమైంది. ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఇన్‌ఛార్జీల పేర్లతో కూడిన లిస్ట్ ఇది. ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది.

కృష్ణా జిల్లాలో మంత్రి జోగి రమేష్‌కు స్థానం చలనం తప్పదంటూ వార్తలు వస్తోన్నాయి. జిల్లాలోని పెడన నియోజకవర్గానికి ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ మార్చుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మైలవరం సీటు లేదా ఏలూరు లోక్‌సభను కేటాయిస్తారని చెబుతున్నారు.
ఈ పరిణామాలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తానో.. అదే సీటును కేటాయిస్తారని అన్నారు. పెడన, మైలవరం లేదా ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చినా తాను సంతోషంగా పోటీ చేస్తానని చెప్పారు.
ఈ ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను వైఎస్‌ఆర్సీపీని వీడబోనని, ఓ సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని, జగన్ నాయకత్వంలో పని చేస్తానని వివరించారు. జగన్ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, ఆయన చూపిన బాటలోనే నడుస్తానని జోగి రమేష్ స్పష్టం చేశారు.
అధికారంలోకి రావడానికి మార్పులు చేర్పులు అత్యంత సహజమేనని జోగి రమేష్ అన్నారు. మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటోన్నారని చెప్పారు. మరోసారి అధికారంలోకి రావడంలో భాగంగానే మార్పులు చేస్తోన్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications