మీకోసం నేను వస్తే.. మీరెళ్లిపోతారే? తమాషాగా ఉందా? ఆ నలుగురి పేర్లు రాసుకోండి: మంత్రి
మీ కోసం నేను వస్తే మీరు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఆ నలుగురి పేర్లు రాసుకోండి అంటూ సభా ప్రాంగణంలో ఉన్న సచివాలయ సిబ్బందిని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన వైఎస్సార్ చేయూత కృతజ్ఞత సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పెడనలోని బస్టాండు సెంటరులో ఈ సభను నిర్వహించారు. చేయూతలో లబ్ధిపొందిన 1906 మంది మహిళలను ఇక్కడికి తీసుకువచ్చారు.
సభలో మంత్రి ప్రసంగిస్తుండగా ముందు వరుసలో ఉన్న నలుగురు మహిళలు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం నేను వస్తే కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఆ నలుగురి పేర్లు రాసుకోవాలని అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇంత జరిగినా కొద్దిసేపటి తర్వాత ఆ నలుగురు వెళ్లిపోవడం గమనార్హం.

సాయంత్రం సమయంలో పెడనలో వర్షం భారీ వర్షం కురిసింది. దీంతో లబ్ధిదారులు రావడం ఆలస్యమైంది. జోగి రమేష్ రాకకు ముందు కుర్చీలు ఖాళీగా కన్పించాయి. దీంతో నిర్వాహకులు అటువైపుగా వెళ్తున్న మహిళలను బలవంతంగా అక్కడి కుర్చీల్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వర్షం తగ్గి లబ్ధిదారులు రావటంతో కుర్చీలన్నీ నిండిపోయాయి. సచివాలయ ఉద్యోగులు ఈ నలుగురి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారుకానీ కనుక్కోలేకపోయారు. వారిది పెడన కాదని నిర్ధారించారు. ఈమేరకు పెడన మున్సిపల్ కమిషనర్‌కు వారు సమాచారం అందజేశారు.












Click it and Unblock the Notifications