ఆసుపత్రిలో మంత్రి కామినేని నిద్ర, దొంగ హల్‌చల్, అత్యాశతో దొరికాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: మంత్రి కామినేని శ్రీనివాస రావు ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రించిన రోజున ఓ దొంగ హల్‌చల్ చేసిన ఆసక్తికర సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆదివారం రాత్రి మంత్రి కామినేని నిద్రకు ఉపక్రమించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఆ సమయంలో ఓ పాత దొంగ యథావిధిగా తన దొంగతనానికి పాల్పడి, ఆ తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. ఓసారి చోరీ చేసి, ఆశ చావక మళ్లీ వచ్చి దొరికిపోయాడు.

నిత్యం ఆసుపత్రిలో చోరీలకు పాల్పడే పాత దొంగ మురళీ మనోహర్ ఎలాంటి జంకులేకుండా ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న రోగులు, ఆసుపత్రి సిబ్బందికి చెందిన అయిదు ఎటిఎం కార్డులు చోరీ చేశాడు. అంతటితో సంతృప్తి చెందకుండా రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్యురాలి విశ్రాంతి గదిలోకి వెళ్లాడు.

Minister Kamineni sleeps in Government Hospital

అప్పుడే వార్డు నుంచి తిరిగి వచ్చిన ఆమె ముఖం కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్తూ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి టేబుల్ పైన పెట్టింది. ఆ గొలుసుని అమాంతం జేబులో వేసుకున్న దొంగ వెళ్తూ వెళ్తూ వైద్యురాలి కోటు జేబులో ఉన్న సెల్‌ఫోన్ చోరీకి యత్నిస్తుండగా అది కింద పడి శబ్దమైంది.

దీంతో అప్రమత్తమైన వైద్యురాలు దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ వైద్యురాలు పోలీసులకు విషయం చెప్పింది. అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే పారిపోయిన దొంగ దగ్గర్లోని ఎటిఎంల వద్దకు వెళ్లి దొంగిలించిన ఎటిఎం కార్డుల ద్వారా నగదు డ్రా చేసే ప్రయత్నం చేశాడు. పిన్ నెంబర్ సరిపోకపోవడంతో డబ్బు రాలేదు. ఆ తర్వాత అతడు మళ్లీ తెల్లవారుజామున ఆసుపత్రిలోకి ప్రవేశించాడు.

ఓ రోగి వద్ద చోరీ చేస్తూ విధులు నిర్వహిస్తున్న ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది కంటపడ్డాడు. వెంటనే పోలీసుల సహాయంతో దొంగను పట్టుకున్న వారు జేబులు వెతకగా వైద్యురాలికి చెందిన బంగారు గొలుసు, ఎటిఎం కార్డులు, ఎంటిఎం స్లిప్పులు లభించాయి. అతనిని మూడో పట్టణ పోలీస్ స్టేషనుకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Kamineni sleeps in Government Hospital on Sunday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి