స్వర్ణబార్‌లో మద్యం కల్తీ ఇలా జరిగింది: బెజవాడ కల్తీమద్యం ఘటనపై మంత్రి కామినేని
అమరావతి: బెజవాడ కల్తీమద్యం ఘటనకు సంబంధించిన బాధితులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఉదయం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మద్యంలో మిథనాల్ కలవటం వల్లే బాధితులు అస్వస్థతకు గురయ్యారన్నారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు వెంకట్రావు పరిస్థితి విషమంగానే ఉందన్నారు. సిద్ధార్థ ఆసుపత్రిలో ఉన్న మరో బాధితుడు బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడని వెల్లడించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
కల్తీ మద్యం ఘటనలో బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. శుక్రవారం 27 మంది బాధితులను ఆసుపత్రి నుంచి డిశార్జి చేశామన్నారు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

మరోవైపు బెజవాడ కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. స్వర్ణ బార్ యాజమన్యానికి చెందిన మరో రెండు బార్‌లను అధికారులు సీజ్ చేశారు. గురువారం గవర్నర్ పేటలోని స్వర్ణ బార్, గాంధీనగర్ లోని ఖుషీబార్ నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.
కల్తీ మద్యంతో ఐదుగురి మృతికి కారణమైన స్వర్ణ బార్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు స్వర్ణబార్ నివేదికను ఎక్సైజ్ కమిషనర్‌కు పంపినట్లు తెలుస్తోంది.
మరో వైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా దూకుడును పెంచింది. సిట్ అధికారుల బృందం బాధితులు, స్థానిక పోలీసుల నుంచి వివరాలను సేకరించింది. గురువారం విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌తో భేటీ అయి కేసు పురోగతిపై చర్చించారు.












Click it and Unblock the Notifications