అమిత్ షా మాటలన్నీ టీడీపీ నేతలు చెప్పినవే: మంత్రి కారుమూరి కౌంటర్
విశాఖపట్నంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడింది ఆయన మాటలు కాదని టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్ షా మాట్లాడారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ పై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కేంద్రం రైల్వేజోన్ హామీ ఇచ్చి నెరవేర్చలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఏపీకి చేసిన న్యాయం ఏమిటో చెప్పాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.

ప్రధాని మోడీ వచ్చినప్పుడు టిడిపి నేతలు దాడి చెయ్యలేదా? ప్రధాని మోడీని వ్యక్తిగతంగా టిడిపి నేతలు విమర్శించలేదా? అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి ఏమీ మాట్లాడకపోయినా టిడిపి, బిజెపి నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో 40 గుళ్లు కూలిస్తే బీజేపీ నేతలు మాట్లాడారా? అంటూ నిలదీశారు.
అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టిడిపి నేతలు చేసింది గుర్తు లేదా? అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. బిజెపి సభా వేదికపై ఉన్న వారు ఎవరు? వారంతా టీడీపీ నేతలు కాదా? అంటూ ఆయన నిలదీశారు. అమిత్ షా మాటలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాలపై అమిత్ షా ఎప్పుడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు.

ఎవరో ఏదో చెబితే వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం సరికాదని కారుమూరి నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీ టిడిపినేనని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా సీఎం జగన్ పరిపాలన సాగుతోందని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications