24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. ప్రభుత్వం ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అండగా నిలిచేందుకు పౌర సరఫరాల శాఖలో కీలక సంస్కరణలకు సిద్దమైంది. ఈ మేరకు మంత్రి మనోహర్ ప్రకటన చేసారు. రైతులతో మాట్లాడి ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తేమ శాతంలో పారదర్శకత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారని చెప్పుకొచ్చారు. తాజా నిర్ణయంలో భాగంగా ధాన్యం సేకరణ... చెల్లింపు విధానం పైన స్పష్టత ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి మనోహర్ తెలిపారు. అంటే రూ.12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను.. 6 కోట్ల గోతాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కొన్ని సందర్భాలలో 6 నెలలు నుంచి 9 నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని గుర్తుచేశారు. దాదాపు రూ.1670 కోట్ల బకాయిలు గత ప్రభుత్వం వదిలి వెళ్ళిందని విమర్శించారు. దాదాపు 87 శాతం ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో ఇచ్చామని తెలిపారు. ఈ సారి 24 గంటల్లోనే పేమెంట్ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉదయం, 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు ధాన్యం అమ్మినా రోజు వారికి పేమెంట్ చేస్తున్నామని.. అంటే కేవలం 2 గంటల్లోనే డబ్బు చెల్లిస్తామని చెప్పారు.

వాట్సప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నామని... ఈ సీజన్‌లో రైతులు ఇప్పటికే ఈ సౌలభ్యాన్ని వాడుతున్నారని మంత్రి మనోహర్ తెలిపారు. నవంబర్‌లో 11 లక్షలు, డిసెంబర్‌లో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, మార్చిలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్‌లలో గోధుమ కేజీ 18 రూపాయలకు అందించాలని చూస్తున్నట్లు తెలిపారు. దీపం 2 పథకం విషయంలో నవంబర్ 30 వరకు 3వ విడత కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొంథా తుఫాను బాధితులకు పౌరసరఫరాల శాఖ నిత్యావసరాలు అందించిందన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డ్‌లు 92 శాతం పంపిణీ పూర్తి అయిందని అన్నారు. నెలాఖరున మిగిలిన కార్డులు వెనక్కి తీసుకుని... మనమిత్ర యాప్ ద్వారా కోరిన వారికి పరిశీలించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. నూటికి నూరు శాతం ఈ క్రాప్‌లో నమోదు అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications