సీఎం జగన్ ను అడ్డుతొలిగించే కుట్ర - మంత్రి నాగార్జున సంచలనం : మహానాడులో వ్యాఖ్యలపై..!!
ఏపీ మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఒక వైపు.. టీడీపీ మహానాడు మరోవైపు. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విమర్శలు - ప్రతివిమర్శలతో హోరెత్తుతోంది. ఇదే సమయంలో మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్‌లో మంత్రి నాగార్జున మహానాడు వేదికగా చంద్రబాబు ..లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలతో ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రి జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డు తొలిగించేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. జగన్ ను రాష్ట్రంలో లేకుండా చేస్తానని టీడీపీ అధినేత వ్యాఖ్యానించటం పలు అనుమానాలకు తావిస్తోందంటూ వ్యాఖ్యానించారు. గతంలోనూ చంద్రబాబు - లోకేష్ సీఎం ను ఉద్దేశించి గాల్లో వచ్చినవాడు గాల్లోనే పోతాడంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేసారు. రోజురోజుకు జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు.. జగన్‌ను అడ్డుతొలగించుకోవాలనే కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.

జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో చంద్రబాబు పలుమార్లు చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ అభిమానులను కలవరపెడుతున్నాయని చెప్పారు. జగన్‌ను రాష్ట్రంలోనే లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోందన్నారు. జగన్‌ను కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
పార్టీ కార్యకర్తలు..అభిమానులు సీఎంకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే తట్టుకోలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా..తిరిగి వైసీపీకే అధికారం దక్కుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications